బీజేపీతోనే పట్టణాల ప్రగతి సాధ్యం : నెల్లూరి కోటేశ్వరరావు

బీజేపీతోనే పట్టణాల ప్రగతి సాధ్యం : నెల్లూరి కోటేశ్వరరావు
  • పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు

మధిర, వెలుగు : తెలంగాణలో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పట్టణాల అభివృద్ధికి నయాపైసా నిధులు రావని, ఇక ఉనికి కోసం పోరాడుతున్న బీఆర్‌‌ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. నగరాలు, పట్టణాల రూపురేఖలు మారాలంటే కేంద్ర నిధులు అత్యవసరమని, అందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

గత 11 ఏండ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. సీఎం ఢిల్లీకి వెళ్లడం రావడం తప్ప ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్‌‌ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ అంతకు మించి దోచుకుంటోందని ఆరోపించారు.  కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరవెల్లి రాజేశ్​గుప్తా, జిల్లా కార్యదర్శులు రామిశెట్టి నాగేశ్వరరావు, కుంచం కృష్ణారావు, జిల్లా మీడియా ఇన్​ఛార్జి నెల్లూరీ బెనర్జీ, మధిర అసెంబ్లీ అభ్యర్థి పెరుమాళ్లపల్లి విజయరాజు, అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు, మండల ప్రభారి సుబ్బారావు,  మర్సకట్ల స్వర్ణాకర్, నాయకులు చిలువేరు సాంబశివరావు, జ్వాలా నరసింహారావు, కొప్పురావూరి రామ యోగేశ్వరరావు తదితరులు
 పాల్గొన్నారు.