అవినీతి పాలనను బొంద పెడ్తం

అవినీతి పాలనను బొంద పెడ్తం
  • రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తున్నది
  • కేసీఆర్​కు ఏటీఎంలా కాళేశ్వరం .. ఢిల్లీ దాకా ఆయన అవినీతి
  • కేంద్రం వరద సాయం పంపినా.. ప్రజలకు రాష్ట్ర సర్కార్  ఇయ్యలే
  • సభలు అడ్డుకునేందుకు చివరి నిజాం లెక్కనే సీఎం ఫర్మానాలు
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు గుణపాఠం తప్పదని హెచ్చరిక

వరంగల్ : సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆటలు సాగవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బందీ చేసి రాచరిక పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు.  బీజేపీ స్టేట్​చీఫ్​ సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ముగిసింది. ఈ సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. తెలంగాణను సీఎం కేసీఆర్ చీకట్లోకి నెట్టేశారని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సంజయ్ పాదయాత్ర చేపట్టారన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్​ ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ లో కేసీఆర్ కు చుక్కలు చూపించామని, వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు చుక్కలు చూపిస్తామన్నారు. 

పాదయాత్ర, సభపై ఆంక్షలేంది?...
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రకు అడుగడుగునా సీఎం కేసీఆర్ ఆంక్షలు విధించారని, తాను 2వ విడత పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా... సంజయ్​ను అరెస్ట్ చేశారని నడ్డా తెలిపారు. ‘‘ఈ బహిరంగ సభకు గ్రౌండ్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసినట్లు విన్నాను.  న్యాయం బీజేపీ వైపు ఉంది కాబట్టే కోర్టు ద్వారా పర్మిషన్ పొందాం. యాత్రను అడ్డుకుని బండి సంజయ్ ను అరెస్టు చేశారు. ఇదేం పద్ధతి? ప్రజల్లో తిరిగే స్వేచ్ఛ నేతలకు ఉండదా?” అని ఆయన నిలదీశారు. 144 సెక్షన్ ఉందని చెప్పి సభకు ప్రజలను రాకుండా పోలీసులు అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తున్నదని, బీజేపీని చూసి కేసీఆర్​ వణికిపోతున్నారని దుయ్యబట్టారు. సభలు పెట్టుకోకుండా చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్  ఫర్మానా జారీ చేశారని, ఆ తర్వాత ఆయన కనుమరుగయ్యారని  నడ్డా అన్నారు. ఇప్పుడు కేసీఆర్​ కూడా అలాంటి ఫర్మానానే జారీ చేశారని, ఆయనకు కూడా అదే చివరి ఫర్మానా అవుతుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి, తానాషాహీ పాలనను బొందపెడతామన్నారు. 

మజ్లిస్​కు భయపడే విమోచన దినం జరుపుతలే...
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదని జేపీ నడ్డా ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను ఏర్పాటు చేయాలని అన్ని పార్టీల కంటే ముందు కాకినాడ తీర్మానం చేసింది బీజేపీయేనని తెలిపారు.  

కేసీఆర్ కు ఏటీఎంలా కాళేశ్వరం...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లాగా మారిందని, డబ్బులు తయారు చేసే మిషన్ లాగా తయారైందని జేపీ నడ్డా ఆరోపించారు. ‘‘40 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును.. లక్షా 40 వేల కోట్లకు తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టును అవినీతికి పర్యాయపదంగా మార్చారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుంది. ఫలితంగా లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం కూరుకుపోయింది” అని అన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలు ఢిల్లీ వరకు పాకాయాని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో పీఎం ఆవాస్ యోజన నిధులు వినియోగిస్తున్నప్పటికీ కేంద్రం వాటా గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో వరదలు వస్తే  కేంద్రం రూ. 377 కోట్లు రిలీజ్ చేసిందని, ఆ నిధుల్లో కేసీఆర్ ప్రజలకు పైసా కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు. జల్ జీవన్ స్కీం కింద కేంద్రం రూ.3,098 కోట్లు ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లే ఖర్చు చేసిందన్నారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తామని వరంగల్ సెంట్రల్ జైలును కూల్చారని, ఇప్పటి వరకు హాస్పిల్ నిర్మించలేదని నడ్డా  విమర్శించారు. ప్రధాని మోడీ రిలీజ్ చేసిన వేలాది కోట్లను సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.  కేంద్రం రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందని, అయినా కేంద్రం తెలంగాణకు ఏం చేయడం లేదని కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని నడ్డా మండిపడ్డారు. కాగా, తొలుత నడ్డా 'ఓరుగల్లు గడ్డ.. వరంగల్ ప్రజలకు నా నమస్కారం’ అని తెలుగులో ప్రసంగాన్నిప్రారంభించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడ అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

‘అప్పట్లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సభలు, సమావేశాలను అడ్డుకునేందుకు ప్రజలపై గస్తీ నిషాన్ - 53 ఫర్మానా ప్రయోగించిండు.  అదే ఆయనకు చివరి ఫర్మానా అయింది. సీఎం కేసీఆర్ కూడా చివరి నిజాం బాటలోనే నడుస్తూ.. సభలు పెట్టుకోవద్దని ఫర్మానా జారీ చేసిండు. కేసీఆర్ కు కూడా ఇదే చివరి ఫర్మానా అవుతుంది. రానున్న రోజుల్లో టీఆర్​ఎస్​ అవినీతి పాలనకు ప్రజలు ముగింపు పలికి.. కేసీఆర్​ను ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం’.

 - బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

నడ్డాతో వివేక్‌, రాజగోపాల్‌ భేటీ...
నడ్డాతో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి భేటీ అయ్యారు. శనివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో వారు మర్యాదపూర్వకంగా నడ్డాను కలిశారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.