నమో నామస్మరణ .. మోదీ సభకు భారీగా తరలివచ్చిన జనం

నమో నామస్మరణ .. మోదీ సభకు భారీగా తరలివచ్చిన జనం
  • ఆదిలాబాద్ వీరులను గుర్తు చేసిన ప్రధాని

ఆదిలాబాద్, వెలుగు : బీజేపీ బహిరంగ సభ మోదీ నమస్మరణతో మార్మోగింది. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన సంకల్ప సభకు ఉమ్మడి వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. సభా వేదికపైకి ప్రధాని రాగానే పెద్ద ఎత్తున మోదీ మోదీ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. ప్రధాని తన ప్రసంగంలో పలుమార్లు తెలుగులో మాట్లాడడం అందరిలో జోష్ నింపింది. ‘నా తెలంగాణ కుటుంబసభ్యులకు నమస్కారాలు, నాలుగు వందల సీట్లు దాటాలి బీజేపీకి ఓటు వేయాలి’ అంటూ తెలుగులో వ్యాఖ్యానించడంతో చప్పట్లతో సభ మార్మోగింది. రాంజీగోండు, కుమ్రం భీం వీరులను ప్రధాని స్మరించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కలిసి పాల్గొనడం ఇదే మొదటి. మోదీ సభతో పట్టణమంతా కాషాయమయమైంది. 

రావడం మొదటిసారి

 ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. 40 ఏండ్ల నుంచి ప్రధానమంత్రి హోదాలో ఎవరూ మన జిల్లాకు రాలేదన్నారు. మోదీ ఆదిలాబాద్ జిల్లాకు రావడంతో ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అయ్యింద న్నారు. అదిలాబాద్ ప్రజలకు చిరకాల కోరిక అదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్, యూనివర్సిటీ, ఎయిర్​పోర్ట్ మంజూరు చేయాలని కోరారు. జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూతబడిన సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేయాలని, మెగా టెక్స్ టైల్ పార్క్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ కోరారు. 

సీఏంకు స్వాగతం..

ప్రధాన మంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్​చార్జి మంత్రి సీతక్క, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌస్ ఆలం, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లీడర్లు కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేశ్ త‌దిత‌రులు ​కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.

17 ఎంపీ సీట్లు గెలుస్తం

తెలంగాణాలో ఈ సారి 17 ఎంపీ సీట్లు గెలుస్తామని కేంద్రమత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సభలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని, భారీ మెజారిటీతో ఎంపీ సీట్లు గెలిచేందుకు మీ ఆశీస్సులు ఉండాలన్నారు. ఆదిలాబాద్ ఆదివాసీ గడ్డపై మరోసారి బీజేపీ జెండా ఎగరాలన్నారు. ఈ సారి హైదరాబాద్​లో ఎంఐఎంను ప్రజలు ఓడించి బీజేపీకి పట్టంకట్టబోతున్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు రేపు అనేది లేదని, పదేండ్లలో పాలనలో అవినీతి, నియంత పాలన చూశామన్నారు. కాంగ్రెస్ అమలు కాని హామీలిచ్చిందని, కనీసం ఆ పథకాలను ఎలా అమలు చేయాలో ప్రణాళిక కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు.