- పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను ప్రశ్నించిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్’పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. ‘‘నక్సల్స్ హింసను పేదల పోరాటంగా చిత్రీకరించడం సిగ్గుచేటు. నక్సల్స్ చేతిలో దారుణంగా హత్యకు గురైన సొంత పార్టీ నేతలు మాజీ స్పీకర్ శ్రీపాదరావు, చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్ వంటి వారిని కాంగ్రెస్ మర్చిపోయిందా?” అని గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
అప్పట్లో మావోయిస్టులను అణచివేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేయడం హాస్యాస్పదమన్నారు. ఆపరేషన్ కగార్ ఎలిమినేషన్ కోసం కాదని, ప్రజల ప్రొటెక్షన్ కోసమేనని తెలిపారు. మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు, పోలీసుల కుటుంబాలకు మహేశ్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
నక్సల్స్ దేశభక్తుల్లా కనిపిస్తున్నరా?: డీకే అరుణ
వేలాది మంది నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని, నక్సల్స్‌ను చర్చలకు పిలిచి, వారి స్థావరాలు తెలుసుకుని మరీ కాల్చి చంపారని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ‘‘ప్రజా ప్రతినిధులను, కాంగ్రెస్ నేతలను పొట్టనబెట్టుకున్న నక్సల్స్.. ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ దృష్టిలో దేశభక్తుల్లా కనిపిస్తున్నరా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సల్స్ అరాచకాలకు బలైన కుటుంబాల మానసిక పరిస్థితి ఏమిటో మహేశ్ గౌడ్‌కు ఏం తెలుసు?’’ అని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రశ్నించారు.
