- మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: నేత కార్మికుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి నిధులు విడుదల చేశారని తెలిపారు.
నేత కార్మికుల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ నేత కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలతో నేతన్నలకు 365 రోజులు ఉపాధి లభించే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
టెస్కోకు ఇప్పటివరకు రూ.588 కోట్ల విలువైన ఆర్డర్లు రావడంతో వేలాది కార్మికులకు ఉపాధి లభిస్తున్నదని వెల్లడించారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హనుమకొండ జిల్లాల్లోని130 మ్యాక్స్, 56 ఎస్ఎస్ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు.
దీంతో మహిళాసభ్యులకు నాణ్యమైన చీరలు అందడంతో పాటు నేతన్నలకు నిరంతరం ఉపాధి దొరుకుతుందని చెప్పారు. అభయహస్తం పథకం కింద రూ.168 కోట్లతో ప్రభుత్వం మూడు కీలక పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి వెల్లడించారు. నేతన్న పొదుపు పథకంలో భాగంగా నేత కార్మికులు 8% పొదుపు చేస్తే ప్రభుత్వం 16% జమ చేస్తుందని వివరించారు. గతేడాది 36,133 మందికి రూ.290.09 కోట్లు, ఈ ఏడాది నమోదైన 33,913 మందికి రూ.13.56 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
