
ఇక్కడి పరిశ్రమలను పట్టించుకోనోళ్లు విశాఖ స్టీల్‌ను ఉద్ధరిస్తరా?
పాలిటిక్స్ కోసమే ఆంధ్రపై కేసీఆర్ ప్రేమ : లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను పట్టించుకోనోళ్లు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరిస్తారా.. అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ‘బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కట్టలేని వాళ్లకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవసరమా’ అని నిలదీశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. తండ్రీకొడుకులు తెలంగాణ ప్రజలను అన్ని సార్లు మోసం చేయలేరని ఫైర్ అయ్యారు.
‘తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికే జాతి.. కేసీఆర్ కుటుంబానికి బానిసలు కారు’ అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలను అజ్ఞానులని కేటీఆర్ అనడంపై లక్ష్మణ్ మండిపడ్డారు. అహంకారంతో, అధికారమదంతో ఇలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘తనొక్కడికే విషయ పరిజ్ఞానం ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అమెరికాలో చదివినంత మాత్రాన ఇతర నేతల గురించి హేళనగా మాట్లాడటం సరికాదు’ అని పేర్కొన్నారు.
ఆంధ్రాలో విశాఖ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామనడాన్ని తప్పుపట్టారు. ‘ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను పౌరుషమున్న ఆంధ్రులు మర్చిపోరు. రాజకీయాల కోసమే ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ ప్రేమ కురిపిస్తున్నారు. ఆంధ్రుల భాష, వేషం, ఆహారపు అలవాట్లను కేసీఆర్ కించపరిచారు’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మూతపడిన కంపెనీల ఓపెనింగ్ఏమైందని నిలదీశారు. వాటిని ప్రారంభించకుండా ఆ పరిశ్రమల భూములపై బీఆర్ఎస్ నేతలు కన్నేశారని ధ్వజమెత్తారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తే.. కేంద్రం ముందుకు వస్తుందన్నారు. తెలంగాణలో 31 మైనింగ్ కంపెనీలపై పూర్తి హక్కులను రాష్ట్రానికే కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. టీఎస్పీఎస్సీ ఘటనపై కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడకపోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
బీజేపీ స్టేట్ ఆఫీసులో జ్యోతిబా పూలే జయంతి
జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పలువురు నేతలు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ ప్రోగ్రామ్ లో పార్టీ స్టేట్ప్రెసిడెంట్బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు బూర నర్సయ్య గౌడ్, చింతల రాంచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రిటైర్డ్ డీజీ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క శాతం ఉన్న సామాజికవర్గానికి నాలుగు మంత్రి పదవులా అని కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.
నెహ్రూ నుంచి రాహుల్ వరకు కాంగ్రెస్ నేతలంతా బీసీలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. బీసీలను సంఘటితం చేసి, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. వెనుకబడిన వర్గాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. బీజేపీలో నడ్డా ప్రాధాన్యతిస్తున్నారని చెప్పారు.