కేంద్రం ఇచ్చిన రూ.640 కోట్లు ఏమయ్యాయ్? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కేంద్రం ఇచ్చిన రూ.640 కోట్లు ఏమయ్యాయ్? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీల అభివృద్ధికి విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సర్పంచుల సంఘం ప్రతినిధులు రాంచందర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. 

అనంతరం వారి సమస్యలను రాంచందర్​రావుకు వివరించారు. ఆయన మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు కారణంగా సర్పంచులు అప్పులపాలై, కొందరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని, సర్పంచులను ఆదుకుంటామని హామీ ఇచ్చారనీ కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పరిస్థితిలో మార్పు లేదన్నారు. 

రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 640 కోట్ల నిధులు వచ్చినా అవి పంచాయతీల ఖాతాల్లోకి చేరడం లేదన్నారు. నిధుల లేమితో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని,  గ్రామాల్లో కనీస అభివృద్ధి పనులు, శానిటేషన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి దారి మళ్లించిన నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.