హైకోర్టు సూచనల మేరకు ప్రజా సంగ్రామ యాత్ర రీ షెడ్యూల్

హైకోర్టు సూచనల మేరకు ప్రజా సంగ్రామ యాత్ర రీ షెడ్యూల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడింది. పాదయాత్రను రేపట్నుంచి ప్రారంభించనున్నట్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు సూచనల మేరకు సభ, పాదయాత్రను రీషెడ్యూల్ చేసినట్లు చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. అయితే న్యాయస్థానం సూచనల మేరకు సభ నిర్వాహణ, పాదయాత్ర ప్రారంభానికి సమయం లేకపోవడంతో బీజేపీ నేతలు పునరాలోచనలోపడ్డారు. చివరకు బహిరంగ సభతో పాటు పాదయాత్రను మంగళవారం  ప్రారంభించాలని నిర్ణయించారు. కోర్టు సూచనల మేరకే పాదయాత్ర నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి స్పష్టంచేశారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కుటుంబ పాలనను ఎండగడుతూ ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతుండటంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మనోహర్ రెడ్డి ఆరోపించారు. గతంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సభను అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఐదో విడత పాదయాత్ర కోసం 10 రోజుల క్రితమే అనుమతి పత్రాలు ఇచ్చిన పోలీసులు సభకు ఒక్క రోజు ముందు పర్మిషన్ రద్దు చేశారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టుకు మనోహర్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు.