- సుప్రీంకోర్టు చెప్పినందుకే సర్
- ఈసీపై ఆరోపణలకు ఆధారాలు చూపట్లే
- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: సర్ పై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. మైనార్టీల ఓట్లను తొలగిస్తున్నారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధ సంస్థలపై తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. సుప్రీంకోర్టు చెప్పినందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఈసీపై ఆరోపణలు చేస్తున్న వారు అందుకు తగిన ఆధారాలు చూపించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారన్న ఆయన.. ఓట్లను డిలీట్ చేయడం కార్యకర్తల చేతుల్లో ఉండదన్నారు. మీడియా అన్ని విషయాలను నిష్పక్షపాతంగా చూపిస్తూ ప్రజలకు వివరించాలని సూచించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు, ఢిల్లీ పరిణామాలకు కౌంటర్‌గా నవంబర్ 1న హైదరాబాద్‌లో మహా పాదయాత్ర చేపడుతున్నట్టు చెప్పారు.
పోడు భూముల సమస్యను తేల్చాలి
రాష్ట్రంలోని ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన.. నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీమ్ పోరాటమే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. ఆదివాసీలపై పాలకులు నేటికీ సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధమా?: ఎంపీ రఘునందన్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టులో టెండర్ల ప్రక్రియ మొదలుకొని చివరి చెల్లింపు వరకు జరిగిన అన్ని అంశాలపై సమగ్రంగా పూర్తిస్థాయి సీబీఐ విచారణ జరిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మేడిగడ్డకు వచ్చి ప్రాజెక్టుపై అడ్డగోలు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, మూడేండ్లయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కులగణనలో బీసీలు 56 శాతం ఉన్నారని చెబుతూ కేబినెట్లో తగిన ప్రాతినిధ్యం ఎందుకు కల్పించలేదో చెప్పాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.4 వేల భృతి ఎక్కడ పోయిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ కాళేశ్వరం అంశాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
