12 మందితో బీజేపీ 4వ లిస్ట్

12 మందితో బీజేపీ 4వ లిస్ట్
  •     ఇప్పటి వరకు100 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
  •     పెండింగ్​లో మరో 19 సీట్లు
  •     నేడో రేపో తుది జాబితా

హైదరాబాద్, వెలుగు : బీజేపీ 12 మంది అభ్యర్థులతో నాలుగో లిస్ట్ రిలీజ్​ చేసింది. ఈ మేరకు పార్టీ నేషనల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. నాలుగు విడతల్లో ఇప్పటి వరకు100 సీట్లను ప్రకటించిన కమలం పార్టీ, మరో 19 స్థానాలను పెండింగ్ లో ఉంచింది. 

తాజా జాబితాలో ఐదుగురు బీసీలు, ముగ్గురు రెడ్డిలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, మరో మహిళ ఉన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమె పోటీ చేస్తుందని భావించిన గద్వాల సీటును బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ శివకు కేటాయించారు.  

వికాస్ ​రావుకు నో టికెట్

నాలుగో లిస్ట్​లో వేములవాడ టికెట్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమకు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆ సీటును మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు కుమారుడు వికాస్ రావు ఆశించగా ఆయనకు బీజేపీ మొండి చెయ్యి చూపింది. వేములవాడ టికెట్ తుల ఉమకు ఇవ్వాలని ఈటల పట్టుపట్టగా, బండి సంజయ్ మాత్రం వికాస్ రావుకు ఇవ్వాలని కోరారు. సంజయ్ కూడా హుస్నాబాద్​లో తన అనుచరుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తికి టికెట్ ఇప్పించుకున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని వేములవాడలో తాను సిఫారసు చేసిన వికాస్ రావుకు కాకుండా తుల ఉమకు టికెట్ ఇవ్వడంపై సంజయ్ అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

ఇటీవల చేరిన నేతలకు టికెట్లు

ఇటీవల బీజేపీలో చేరిన ఇద్దరు నేతలకు టికెట్ దక్కింది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్​రాకపోవటంతో బీజేపీలో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్ ఇచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ టికెట్ ఆశించి రాకపోవటంతో బీజేపీలో చేరిన చలమలకు టికెట్ వచ్చింది. ములుగులో బీఆర్ఎస్​ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి అజ్మీర చందులాల్ కుమారుడు ప్రహ్లాద్​కు టికెట్ వచ్చింది.

తెలంగాణలో ఉనికిలో లేని జనసేనకు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సొంత పార్టీ లీడర్లు, క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వేములవాడ టికెట్‌ను తుల ఉమకు కేటాయించడంతో పార్టీ స్టేట్‌ ఆఫీసు వద్ద కార్యకర్తలు బైటాయించి, నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఓ యువకుడు పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. 

పెండింగ్ స్థానాలు

పెద్దపల్లి, సంగారెడ్డి, నర్సంపేట, ఖమ్మం,  వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, మధిర, కోదాడ, నాగర్ కర్నూల్, అలంపూర్, దేవరకద్ర, నాంపల్లి, కంటోన్మెంట్, తాండూరు, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి,  మేడ్చల్ స్థానాలను బీజేపీ పెండింగ్​లో పెట్టింది.