నార్త్ బీజేపీ.. సౌత్ కాంగ్రెస్

నార్త్ బీజేపీ.. సౌత్ కాంగ్రెస్
  • ఉత్తర తెలంగాణలో నాలుగు చోట్ల కమల వికాసం
  • దక్షిణాదిన నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభంజనం
  • పెద్దపల్లి,  వరంగల్, జహీరాబాద్, పాలమూరుల్లో మాత్రం భిన్న ఫలితాలు

హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణపై బీజేపీ, దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్​ పట్టు నిలుపుకున్నాయి.  నార్త్​ తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్  సిట్టింగ్ సీట్లను బీజేపీ తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు బీఆర్​ఎస్​కు కంచుకోటగా ఉన్న మెదక్​లోనూ పాగా వేసింది.  ఇక సౌత్​ తెలంగాణలోని వరంగల్​,  ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, నాగర్​కర్నూల్​ సీట్లను భారీ మెజారిటీతో కాంగ్రెస్​ పార్టీ కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభంజనానికి పెద్దపల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్​లో సురేష్ షెట్కార్​ చెక్ ​పెట్టగా, దక్షిణ తెలంగాణలో మహబూబ్​నగర్​ నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ గెలుపొందడం విశేషం. 

ఉత్తర తెలంగాణలో బీజేపీ జోష్​.. 

ఉత్తర తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ ​సిట్టింగ్​ సీట్లను దక్కించుకున్నారు. ఆదిలాబాద్ ​నుంచి సోయం బాపురావుకు బదులు బీఆర్ఎస్​ నుంచి వచ్చిన గెడం నగేశ్​కు బీజేపీ టికెట్​ ఇచ్చింది. ఈ విషయంలో హైకమాండ్​ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టినప్పటికీ  అక్కడి ప్రజలు మాత్రం మళ్లీ బీజేపీకే పట్టంగట్టారు. 

ఇక  బీఆర్ఎస్​కు కంచుకోట, సిట్టింగ్​ సీటైన  మెదక్​ను త్రిముఖ పోరులో కమలం పార్టీ గెలుచుకోగలిగింది. ఇక్కడ హోరాహోరీ పోరులో కాంగ్రెస్​పై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చిరస్మరణీయ విజయం సాధించారు. అప్పట్లో దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలవడంతో  రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు వచ్చింది. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలైనప్పటికీ తాజాగా మెదక్​ ఎంపీగా గెలిచిన రఘునందన్  బీఆర్ఎస్​ను చావుదెబ్బ తీశారు. బీజేపీ ఊపులోనూ పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్ స్థానాలను  కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడూ బీఆర్ఎస్​ సిట్టింగ్​ సీట్లు కావడం విశేషం. 

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు.. ​

దక్షిణ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్​ స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయాలు నమోదు చేసింది. ఈ ప్రాంతంలో కేవలం ఒక్క మహబూబ్ నగర్ సీటును మాత్రమే బీజేపీ  గెలుచుకుంది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇక్కడ విజయం సాధించారు. పాలమూరు నుంచి బీజేపీ తరపున గతంలో సీనియర్​ నేత జితేందర్ రెడ్డి  ప్రాతినిధ్యం వహించారు. 

అరుణ విజయంతో సౌత్ తెలంగాణలో బీజేపీ రానున్న రోజుల్లో బలపడే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నార్త్ నుంచి నాలుగు సీట్లను సాధించిన బీజేపీ, సికింద్రాబాద్​తో పాటు సిటీ శివారులోని మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిట్టింగ్​ సీటును కాపాడుకోగా,  మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో బీజేపీ బలం మరింత పెరిగింది.