బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్, ఈసీ లు ఓట్లను చోరీ చేస్తున్నాయి ..బిహార్ భోజాపూర్ జిల్లాలో ఓటర్ అధికార యాత్ర

బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్, ఈసీ లు  ఓట్లను చోరీ చేస్తున్నాయి ..బిహార్ భోజాపూర్ జిల్లాలో   ఓటర్ అధికార యాత్ర
  • దళితుల ఓటు హక్కును దోచుకుంటున్నారు: రాహుల్ గాంధీ

పాట్నా: దేశంలో బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్, ఎన్నికల సంఘం(ఈసీ) ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని లోక్‌‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్‌‌లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌‌ఐఆర్) ను రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా ఆయన అభివర్ణించారు. 'ఓటర్ అధికార్ యాత్ర'లో భాగంగా ఆయన శనివారం బిహార్‌‌లోని భోజ్‌‌పూర్ జిల్లా ఆరాలో పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.."బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్, ఎన్నికల సంఘం దేశంలో ఓట్ల చోరీలో మునిగిపోయాయి. బిహార్‌‌లో ఎస్‌‌ఐఆర్ పేరుతో లక్షలాది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోరీకి వ్యతిరేక ఉద్యమంగా మారుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, కర్నాటకలో ఓట్ చోరీ జరిగింది. కానీ బిహార్‌‌లో ఒక్క ఓటు కూడా చోరీకి గురికాకుండా పోరాడుతాం. దళితులు, మైనారిటీలు, మహిళల ఓటు హక్కును మోదీ ప్రభుత్వం దోచుకుంటోంది. తద్వారా రాజ్యాంగంపై దాడి చేస్తోంది. ఇకపై దేశంలో ఎక్కడా ఓట్ చోరీ జరగకుండా బీజేపీని మేం అడ్డుకుంటాం" అని రాహుల్ పేర్కొన్నారు. ఈ యాత్రలో సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌‌లతో పాటు ఇండియా కూటమికి చెందిన ఇతర నేతలు పాల్గొన్నారు.