
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యంత మోసానికి గురైంది దళిత సమాజమేనని తెలంగాణ ఎస్సీ మోర్చా ఇన్ చార్జి, ఎంపీ మునిస్వామి అన్నారు. మోసపు హామీలతో దళితులను సీఎం కేసీఆర్ కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని మునిస్వామి ఫైర్ అయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొప్పు బాష అధ్యక్షతన శుక్రవారం బర్కత్ పురలోని బీజేపీ సిటీ ఆఫీస్ లో ఎస్సీ మోర్చా పదాధికారులు, జిల్లా ఇన్ చార్జులతో మునిస్వామి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కొని, ఇపుడు దళిత బంధు పేరుతో మరో కొత్త మోసానికి తెరలేపారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మోసాలపై పోరాటానికి సిద్ధం కావాలని మునిస్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి , జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్.కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు వేముల అశోక్ పాల్గొన్నారు.