పశ్చిమబెంగాల్లో బీజేపీ ప్రభుత్వం బీసీల 17% రిజర్వేషన్లను 7 శాతానికి తగ్గించింది. ఎన్నికలలో బీసీలకు సామాజిక న్యాయంతో పాటు, గౌరవాన్ని అందిస్తామన్న బీజేపీ గెలవగానే అత్యంత వెనుకబడిన బీసీ–ఏ గ్రూపులో 10 శాతాన్ని తొలగించడం సరైన చర్యనా?
బీసీ– బీ గ్రూపులోని 7% రిజర్వేషన్లను మాత్రం కొనసాగిస్తున్నారు. వాస్తవానికి జాతీయ స్థాయిలో ఓబీసీలకు 27 శాతాన్ని కేటాయించాలని మండల్ కమిషన్ సిఫార్సు చేసింది. భారత ప్రభుత్వం ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ 1990లో నాటి ప్రధానమంత్రి వీపీ సింగ్ నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సుప్రీంకోర్టు కూడా ఓబీసీ రిజర్వేషన్లను శాస్త్రీయంగానే ఉన్నదని తీర్పునిచ్చింది. ఫలితంగా దేశస్థాయిలో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రాజ్యాంగపరంగా బీసీ రిజర్వేషన్లు న్యాయమైనదిగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలాకాలం వరకు ఏడు శాతం రిజర్వేషన్లను కొనసాగించారు. అప్పటి సీపీఎం ముఖ్యమంత్రి జ్యోతిబసు బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు అంగీకరించలేదు. సీపీఎం పాలన చివరి దశలో ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 10% పెంచి బీసీలకు 17% అమలు చేశారు.
2011లో మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి కాగానే ఆ రిజర్వేషన్లను తొలగించలేదు. బీసీల 17% రిజర్వేషన్లకు 2024 వరకు ఎలాంటి అడ్డంకులు రాలేదు. కానీ, 2024లో పశ్చిమబెంగాల్ హైకోర్టు పెంచిన 10 శాతం రిజర్వేషన్లు కొట్టివేసింది. దానిపై మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని 2025లో మళ్లీ 17% రిజర్వేషన్లను కొనసాగించింది.
ఎన్నికలలో బీసీల పట్ల ప్రేమ ఉన్నట్లు ప్రకటించిన బీజేపీ మే నెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే హైకోర్టు నిర్ణయాన్ని చూపిస్తూ 10% రిజర్వేషన్లు తొలగించింది. రాజ్యాంగ ఆర్టికల్ 15 (4) ఆధారంగా సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనంతో ఓబీసీ రిజర్వేషన్లను నిర్ణయించడమైనది. దాంతో సామాజిక వర్గాలకు కుల, మతాలకు అతీతంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.
బీజేపీ మాత్రం ముస్లింలను మతం పేరు చెప్పి రిజర్వేషన్లను తొలగిస్తోంది. ఇది రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక, విద్య వెనుకబాటు వర్గం సూత్రీకరణకు వ్యతిరేకమైనది. 10 శాతం తొలగింపులో ముస్లింలతోపాటు హిందూ వెనుకబడిన కులాల వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఈ తొలగింపులో అందరూ బాధితులుగా మిగిలిపోయారు. ఇక్కడ ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పుకోవాలి.
భారత ప్రభుత్వం కల్పిస్తున్న ఓబీసీ రిజర్వేషన్లలో హిందువుల 44% జనాభాతోపాటు ముస్లిం 8% సామాజిక వర్గాలు కూడా అందులో భాగమే. దాంతో కొన్ని ముస్లిం వర్గాలు ఓబీసీ రిజర్వేషన్లను అన్ని రాష్ట్రాలలో అనుభవిస్తున్నారు. మరొక విషయం ఏమంటే ఈడబ్ల్యూఎస్ పేరుతో ఫార్వర్డ్ హిందూ కులాలతోపాటు ఫార్వర్డ్ ముస్లిం సామాజిక వర్గాలు కూడా రిజర్వేషన్‌ను పొందుతున్నారు. ఈ వెసులుబాటును 2019లో కల్పించింది ఆనాటి మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమే.
అగ్రకులాల నాయకత్వంలోనే ప్రభుత్వాలు
బెంగాల్ రాష్ట్రంలో ఎదిగిన కులాలవారిని తక్కువ సంఖ్యలో ఉన్న భద్రలోక్గా పిలుస్తున్నప్పటికీ అన్ని పార్టీలు వారి ఆధిపత్యంలోనే నడుస్తాయి. అది కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, తృణమూల్ కాంగ్రెస్ అయినా, చివరకు బీజేపీ అయినా అగ్రకులాల నాయకత్వంలోనే ప్రభుత్వాలు, వ్యవస్థలన్నీ కొనసాగుతున్నాయి.
వెనుకబడిన తరగతులవారు బెంగాల్లో కొన్ని అంచనాల ప్రకారం 55 శాతం వరకు ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం అంతంతగానే పొందుతున్నారు. మొదటినుంచీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయి. హిందూ మహాసభ, జనసంఘ్ రూపంలో కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారు.
బీసీ ప్రధానిగా చెపుతున్న మోదీ బీసీ రిజర్వేషన్లను రామ జన్మభూమి రథయాత్ర పేరుమీద అడ్డుకున్నారు. ఆ రోజుల్లో మండల్ వర్సెస్ మందిర్ ఉద్యమం దేశంలో పెద్ద ఎత్తున కొనసాగింది. కానీ మోదీ ప్రధానమంత్రి పదవికి పోటీపడుతున్నపుడు తాను బీసీనే అని ప్రచారం చేసుకున్నారు.
దాంతో రిజర్వేషన్ శక్తులు కొంతమేరకు స్వాగతించడంతో 2014లో కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసుకోగలిగింది. 2015లో బిహార్ ఎన్నికలలో ఆర్ఎస్ఎస్ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. లాలూ, - నితీష్ జోడీతో బీజేపీ బిహార్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధానమంత్రి మోదీ నేను అత్యంత వెనుకబడిన బీసీనని ప్రచారం చేసుకున్నాడు.
బీసీ రిజర్వేషన్ల పట్ల బీజేపీ వ్యతిరేకత
మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని సామాజిక న్యాయ శక్తులను తనవైపు మలుచుకునే ప్రయత్నం చేశాడు. ఆ రాష్ట్రంలో జాతీయ నాయకులైన ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ 2017లో బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఆ తరువాత మోదీ మాట్లాడుతూ దేశంలో రెండే రెండు కులాలు ఉన్నాయి అన్నారు.
ఒకటి వెనుకబడిన వర్గం, రెండోది వెనుకబడినవాళ్లను అభివృద్ధి చేసే వర్గమన్నారు. వాస్తవానికి మోదీ బీసీ అస్తిత్వం మండల కమిషన్ సమర్పించిన వెనుకబడిన తరగతుల రిపోర్టులో చేర్చలేదు. అందుకే మొదటి నుంచి పలు నాయకులు వారి బీసీ ఐడెంటిటీని ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్లో మోదీ 2001లో సీఎం అయిన తర్వాత వారి కులాన్ని బీసీలలో చేర్చడం జరిగింది. అందుకే వారి బీసీ అస్తిత్వం పలు వివాదాలతో కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పట్ల, కాస్ట్ సెన్సెస్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. కాస్ట్ సెన్సెస్ కు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన బీజేపీ 2026లో జరిగే జనగణనలో కులగణనను చేర్చలేదు. ఈ విషయంపై బీజేపీని ప్రశ్నిస్తే 2027లో జరిగే జనాభా సేకరణలో చేర్చుతామని చెప్పి దాట వేస్తున్నది. దీంతో బీసీల పట్ల బీజేపీ మనస్తత్వం ఏంటో తెలుస్తోంది.
ప్రైవేటీకరణతో తగ్గుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు
బీసీ ఉద్యమ నాయకులమని చెప్పుకునే బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్లను తగ్గించడం ఏవిధంగా సమర్థించుకుంటారు ? మొదటినుంచి బీసీలను అడ్డుకుంటున్న బీజేపీని బీసీ విద్యావంతులు ఏ విధంగా సమర్థిస్థారు.
బీసీలమని విద్య, ఉద్యోగ అవకాశాలను పొందిన ఉద్యోగులు బీజేపీ బీసీ వ్యతిరేకతను ప్రశ్నించడం లేదు. ఇకనైనా కళ్లు తెరిస్తే బీసీల ఐక్యత బలపడుతుంది. 1990 తర్వాత మొదలైన ప్రైవేటీకరణతో ప్రభుత్వరంగ ఉద్యోగాలు తగ్గిపోవడం మొదలైంది. దాంతోపాటు విద్యావ్యవస్థ కూడా ప్రైవేటీకరించబడటం జరుగుతున్నది. పబ్లిక్ సెక్టార్ ప్రైవేటైజేషన్‌తో లక్షలలో బీసీ, ఎస్సీలు రిజర్వేషన్లు కోల్పోతున్నారు.
దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు రిజర్వేషన్ల ఫలితాలను అందుకోలేకపోతున్నారు. బీసీ అవకాశాలు తగ్గడంతో నూతనంగా వచ్చే యువతరంలో బీసీ స్పృహ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది. నగరాలలోని యువ తరం ఉద్యోగ భద్రత లేని జీవితంలోకి నెట్టబడడంతో కాక్రోచ్ల (జిర్రపురుగుల) రూపంలో స్పందిస్తున్నారు. కానీ రాజ్యాంగ అవకాశాలను పొందాల్సిన బీసీలు మాత్రం కొంతమేరకు చైతన్యరహితంగానే మిగిలిపోతున్నారు. రాజకీయ హిందూత్వ ప్రచార ఉద్యమంలో బీసీ అస్తిత్వాన్ని మరిచి రెండో తరగతి పౌరులుగా మిగిలిపోతున్నారు.
రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం
నిరుద్యోగ జీవితం ఎన్నో సమస్యలతో కూడుకున్నది. యువత నిరంతరం అభద్రతతో జీవించడం సహజంగా మారిపోతోంది. ఒకవైపు సామాజిక వెనుకబాటుతనం, రెండోది గ్రామీణ మొదటి తరం నేపథ్యం, మూడోది ఆర్థిక ఆస్థిరత వెనుకబడిన వర్గాలను కుంగదీస్తున్నది.
వీరు కూడా ఒకరోజు కాక్రోచ్ లలాగ తిరగబడే రోజు ఎంతో దూరం లేకపోవచ్చు. ప్రతి సమస్యకు హిందూ, ముస్లిం ప్రచారమే సమాధానంగా గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తున్నది. ప్రతిపక్ష పార్టీలను హేళన చేయడం, మేధావి వర్గాన్ని, విద్యావంతులను అర్బన్ నక్సల్స్‌గా చిత్రీకరించడం బీజేపీ బాధ్యతా రాహిత్యమే.
రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ, ఇన్కమ్ టాక్స్ మొదలైన సంస్థలను అనుచర పాలక సంస్థలుగా మార్చుకోవడం, ప్రచార మాధ్యమాలతో దేశంలో హిందూ, ముస్లిం సమస్య తప్ప వేరే సమస్య లేదన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్న బీజేపీని ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ప్రశ్నిస్తున్నారు.
జెన్ జీ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాక్రోచ్ ఉద్యమ రూపం బీజేపీని మొదటిసారి ఆత్మరక్షణలోకి నెట్టగలిగింది. 20 నుంచి 30 శాతం వరకు ఉద్యోగ భద్రత లేని నిరుద్యోగుల జీవితాలను బీజేపీ గుర్తించడం లేదు.
ధరల పెరుగుదల, మహిళా రిజర్వేషన్లు, బాధ్యతారాహిత్యమైన పాలనపై జెన్ జీ ప్రశ్నలకు బీజేపీ వద్ద సమాధానాలు లేవు. ఒకవైపు సామాజిక న్యాయ శక్తులు రెండోవైపు జెన్ జీ ఉద్యమిస్తే బీజేపీ భవిష్యత్తు ఏమవుతుంది ?
ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ ఎస్, రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్‌వాది పార్టీ, తెలంగాణ
