ఈటలకు ఓటేసి.. సీఎం కేసీఆర్ మెడలు వంచాలె

ఈటలకు ఓటేసి.. సీఎం కేసీఆర్ మెడలు వంచాలె

హనుమకొండ: హుజురాబాద్‌ ప్రజలంతా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌కు ఓటేసి ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని బీజేపీ జాతీయ కార్య నిర్వాహక సభ్యుడు వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు.  కేసీఆర్ అహంకార పూరిత వ్యవహార శైలిని అడ్డుకున్నందుకే ఈటలను ఆయన మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారని అన్నారు. ఇప్పుడు అవినీతి పైసలతో ఓట్లు కొనాలని టీఆర్‌‌ఎస్ పార్టీ చూస్తోందని, ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటలకు భారీ మెజారిటీ అందించడం ద్వారా సీఎం కేసీఆర్ మెడలు వంచాలని కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో బీజేపీ తరఫున వివేక్ వెంకటస్వామి, ఇతర బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వివేక్‌ మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఈటల కోసం తామంతా ఉన్నమంటూ జనం బదులిస్తున్నారని అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఈ టీఆర్‌‌ఎస్ ప్రభుత్వం గద్దె దిగాలంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలవాలని ఆయన చెప్పారు. ఈ ఉప ఎన్నిక ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా సాగుతున్నాయని, సీఎం కేసీఆర్‌‌కు గుణపాఠం చెప్పి.. తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టాలని వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు. 

ఓట్ల కోసమే దళిత బంధు పథకం తెచ్చిండు

ఏ ఉప ఎన్నిక వచ్చినా హామీలు ఇవ్వడం ఆ తర్వాత వాటిని మర్చిపోవడం కేసీఆర్‌‌కు అలవాటుగా మారిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి అన్నారు. ‘‘దళితులకు మూడు ఎకరాల భూమి అని హామీ ఇచ్చి మర్చిపోయిండు.. ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ ఉంది కాబట్టే మళ్లీ దళితులను మోసగించి ఓట్లు వేయించుకోవాలని దళిత బంధు పథకం తెచ్చిండు” అని చెప్పారు. ఈ ఎన్నిక ధర్మానికీ, అధర్మానికీ మధ్య జరుగుతున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటేయాలని పిలుపునిచ్చారు.