
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, మేధావులతో సమావేశం నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎంను కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. బీసీలను గందరగోళంలో పడేస్తున్న బీజేపీ విధానాన్ని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఈ నెల 18న జరిగే కేబినెట్ మీటింగ్లో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని వస్తున్న వదంతులపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు.
బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని జాజుల రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేసే విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నదని జాజుల మండిపడ్డారు.