మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల  గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ  రైజింగ్ 2047 విజన్ తో అన్ని ప్రాంతాల, అన్ని రంగాల, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు..  

మెదక్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ  బిల్డింగ్ కోసం రూ.180 కోట్లు, నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ కోసం రూ.26 కోట్లు మంజూరు కాగా, రూ.200 కోట్ల వ్యయంతో రామాయంపేట లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయ్యిందని గుర్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా 9 వేల125 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గాను రూ.456 కోట్లు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో రూ.35 కోట్లతో, రూ.29.18 కోట్ల తో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్ చర్చి పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు తెలిపారు. బ్యాంక్ లింకేజీ ద్వారా 7 వేల 758 మహిళా సంఘాలకు రూ.110 కోట్లు, వడ్డీ లేని రుణాల కింద 10,574 సంఘాలకు రూ.21.69 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. 

భూ భారతి చట్టం కింద భూ సమస్యలను పరిష్కరించేందుకు  ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా 37 వేల 817 అర్జీలు వచ్చాయని.. విచారణ జరిపి వాటన్నింటిని పరిష్కరించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలో కొత్తగా 9 వేల 964 రేషన్ కార్డులు మంజూరు చేయగా, 34 వేల 730 మంది పేర్లు యాడ్ చేసినట్టు వివరించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 18 వేల 626 మంది వైద్య చికిత్సలు పొందగా, ప్రభుత్వం రూ.49.72  కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. 

రైతు భరోసా పథకం కింద 2 లక్షల 62వేల 43 మంది రైతుల ఖాతాల్లో రూ.220 కోట్లు జమ చేసినట్టు మంత్రి వెల్లడించారు. అలాగే రైతు రుణ మాఫీ కింద 87 వేల 491 మంది రైతులకు రూ.645 కోట్లు మాఫీ చేసినట్టు తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద  జిల్లాలో లక్షా 27 వేల 393 మంది విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేసి రూ.65 కోట్ల సబ్సిడీ అందజేసినట్టు చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సులలో 3 కోట్ల 2 లక్షల సార్లు ఉచితంగా ప్రయాణించగా, రూ.83.50 కోట్ల లబ్ధి కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్ పాల్గొన్నారు.