
- ఉమ్మడి రాష్ట్రంలో ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ నిధుల దుర్వినియోగం
- విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్, వెలుగు: ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ) నిధుల దుర్వినియోగం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి ఆకుల కిషన్ సహా మరికొంత మందిపై అభియోగాలు మోపింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2005, ఏప్రిల్ నుంచి 2008 వరకు ఏపీ మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం జరిగినట్లు హైదరాబాద్ సీఐడీలో కేసు నమోదు అయ్యింది. ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారి ఆకుల కిషన్ మరికొంత మంది.. ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై కార్పొరేషన్ నిధులు దారి మళ్లించినట్లు సీఐడీ గుర్తించింది.
భవనాల లీజు, అద్దెకు సంబంధించి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు నష్టాన్ని కలిగించారని దర్యాప్తులో వెల్లడైంది. సీఐడీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసింది. ఆకుల కిషన్ కార్పొరేషన్ నిధులను సరైన పూచీకత్తులు, డాక్యుమెంటేషన్ లేకుండానే అనర్హులు, ప్రైవేట్ వ్యక్తుల బినామీలకు రూ.15.39 కోట్లు రుణాలు ఇచ్చాడని ఈడీ గుర్తించింది.
ఆకుల కిషన్, కార్పొరేషన్ సీఈవో సంతోష్ కుమార్‌తో కలిసి ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ పేరుతో నకిలీ బ్యాంకు ఖాతాలను తెరిచి, ఫేక్ అగ్రిమెంట్లతో రూ.7.5 కోట్లు కొల్లగొట్టారని ఈడీ గుర్తించింది. ఆ మొత్తం వ్యక్తిగత ఖాతాలు, ఇతరుల అకౌంట్లకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.
సెల్ ఫోన్లు, ప్రింటింగ్ మిషన్లు, టెండర్లు లేకుండా వాహనాలను కూడా అధిక ధరలకు కొనుగోలు చేశాడని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీకి మొత్తం రూ.23.46 కోట్లు నష్టాన్ని కలిగించారని తేల్చింది. ఇప్పటికే కిషన్‌కు చెందిన రూ.1.26 కోట్లు విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.