ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై  దాఖలైన పిటిషన్ కొట్టివేత
  • ఆమె ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌‌‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, వెలుగు: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నిక చెల్లందంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున కోవా లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుంచి అజ్మీరా శ్యామ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కోవా లక్ష్మి విజయం సాధించారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌‌‌‌లో ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన ఇన్‌‌‌‌కం ట్యాక్స్ వివరాలను లక్ష్మి దాచారని ఆరోపిస్తూ హైకోర్టును అజ్మీరా శ్యామ్ ఆశ్రయించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పుడు సమాచారాన్ని అందించినందున ఆమె ఎన్నిక చెల్లదని పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు.

 హైకోర్టు ఆ పిటిషన్‌‌‌‌ను కొట్టివేయడంతో అజ్మీరా శ్యామ్ గతేడాది నవంబర్ 21న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌‌‌‌ల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని, లక్ష్మి అఫిడవిట్‌‌‌‌లో ఆదాయ పన్నుకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్థిక అంశాలన్నీ స్పష్టంగా వెల్లడించారని ఆమె తరఫు అడ్వకేట్ కోర్టు దృష్టికి తెచ్చారు.  మోహిత్ రావు వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.