
- 9 షెడ్యూల్ లో చేర్చాల్సిందేనన్న కాంగ్రెస్
- సాధ్యం కాకుంటే రాష్ట్ర బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న మంత్రి పొన్నం
- మేం హామీ ఇవ్వలేదంటున్న రాంచందర్ రావు
- ముస్లింలను జాబితాలో ఎలా చేర్చారంటున్న బండి
- 24న ఢిల్లీలో ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం
హైదరాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలకు బీజేపీ రూపంలో అడ్డంకి ఎదురవుతోంది. 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని, రిజర్వేషన్ల పరిమితి 50% మించొద్దని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నిన్న ఢిల్లీలోకుండబద్దలు కొట్టారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను పరిష్కరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసిందని అన్నారు. ఇప్పుడు 9వ షెడ్యూల్ లో చేర్చాలనడం ఏమిటన్నారు. 42 శాతం అంటే, 50 శాతం పరిమితి దాటుతుందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ని సవరించాల్సి ఉంటుందని రాంచందర్‌రావు ప్రస్తావించారు.
ఇవేవీ పట్టించుకోకుండా షెడ్యూల్ 9లో చేర్చాలనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘రామచందర్‌రావు మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యం అంటున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో రిజర్వేషన్లు పెంచారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలుకావో చూస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోం’’ అని హెచ్చరించారు. న్యాయపరమైన చిక్కులున్నాయని తెలిసినా కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్ అని ప్రకటించారని, దానిని అమలు చేసే బాధ్యత వారిదేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గతంలోనే ప్రకటన చేశారు.
తొమ్మిదో షెడ్యూల్‌ను చూపిస్తూ కేంద్రంపై నిందలు వేయకుండా, 42 శాతం రిజర్వేషన్ల హామీని ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల జాబితాలో ముస్లింలను ఎలా చేర్చుతారని ఆయన మండిపడ్డారు. ఇదే తరుణంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
►ALSO READ | జాతీయ స్థాయిలో కులగణన తెరపైకి రావడంలో తెలంగాణదే కీ రోల్
ఈ సమావేశంలో కులగణన చేపట్టిన తీరును వివరించనున్నారు. అదే సమయంలో రిజర్వేషన్ల అమలు కోసం 9 వ షెడ్యూల్ లో చేర్చుతూ ఉభయ సభల్లో తీర్మానం చేసేలా చూడాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ని రిక్వెస్ట్ చేయనున్నారు.
గవర్నర్ వద్దే ఆర్డినెన్స్
పంచాయతీరాజ్ యాక్ట్– 2018 సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరారు. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్285 (ఏ)లో రిజర్వేషన్లు 50 శాతం మించవద్దనే నిబంధన ఉండగా, దానిని కులగణన సర్వేలోని ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయని ఇటీవల ప్రభుత్వం మార్చింది. ఇలా మార్చిన ఆర్డినెన్స్ ముసాయిదా ను గవర్నర్కు పంపగా సవరణపై ఆయన లీగల్ ఒపీనియన్ కోరినట్టు తెలిసింది. దీనిపై గవర్నర్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆయన చేస్తారా..? లేదా..? అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలిస్తేనే..
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ మూడు రకాల ప్రయత్నాలు చేసింది. మొదటిది కులగణన చేయడం.. హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెడ్ క మిషన్ వేసీ క్యాస్ట్ సెన్సెస్ చేపట్టింది. అసెంబ్లీలో తీర్మానం పెట్టి పాస్ చేయించింది. ఆ తర్వాత దానిని గవర్నర్ కు పంపింది. ఆ బిల్లుపై గవర్నర్ సంతకం చేసి కేంద్రానికి పంపారు. సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల దరిమిలా మరో అస్త్రాన్ని సంధించింది. అదేమిటంటే అసెంబ్లీని, మండలిని ప్రోరోగ్ చేసి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది.
పంచాయతీరాజ్ యాక్ట్ –2018కి సవరణలు చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేసింది. ఈ మేరకు ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. మరో అడుగు ముందుకు ఎంపీలతో సమావేశం నిర్వహించి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ముంచుకొస్తున్న గడువు
సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ముందు రిజర్వేషన్లు ఫైనల్ కావాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, మండల, జిల్లా పరిషత్ ల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటన్నింటికీ కొత్తగా వచ్చే రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. దీంతో పల్లె, పట్నం అంతా రిజర్వేషన్ల నిర్ణయం వైపు ఎదురు చూస్తున్నాయి.