
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన ఆధారంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ముందకెళ్తామని స్పష్టం చేశారు. మంగళవారం (జూలై 22) సెక్రటేరియట్లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని.. ఈ బిల్లుకు పార్లమెంట్లో అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేయాలని కోరారు.
ఈ బిల్లు త్వరగా ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. ఆయన చెప్పిన మాట ప్రకారమే రాష్ట్రంలో పవర్లోకి రాగానే కుల గణన నిర్వహించామని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కులగణన అంశం తెరపైకి రావడంలో తెలంగాణ రాష్ట్రానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన చేసిన తర్వాతే దీనిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదట కులగణన వద్దని దబాయించింది కానీ తెలంగాణ సర్కార్, రాహుల్ గాంధీ ఒత్తిడికి తలొగ్గి దేశవ్యాప్త జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కులగణన సర్వేను చాలా పకడ్భందీగా, పారదర్శకంగా నిర్వహించామని అందుకే తెలంగాణను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు. తెలంగాణ జరిగిన విధానమే రేపు దేశవ్యాప్తంగా అమలు కానుందన్నారు.
Also Read : రామచందర్ రావు నోటీసులకు భయపడ
కేంద్ర ప్రభుత్వం కులగణన, జనగణన చేయడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఏవైనా న్యాయపరమైన సమస్యలు వస్తే ఎదుర్కొవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కుల గణన నివేదికను కేబినెట్, శాసన సభలో ప్రవేశపెట్టి ఆమోదించామన్నారు. తెలంగాణ సర్కార్ చేసిన కులగణన దేశంలోనే చరిత్రాత్మకంగా మారిందన్నారు.