ఉద్యోగులు అధైర్యపడొద్దు.. వచ్చేది బీజేపీ సర్కారే

ఉద్యోగులు అధైర్యపడొద్దు.. వచ్చేది బీజేపీ సర్కారే

ముఖ్యమంత్రిని ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. నాంపల్లిలోని రాష్ట్ర  బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జీవో 317ను సవరించే వరకూ వెనుకాడబోమన్నారు. పోరాటాలను అడ్డుకోవడానికి కేసులు, అరెస్టులనే సీఎం కేసీఆర్ ఆయుధంగా ఎంచుకుంటే జైళ్లనే బీజేపీ ఉద్యమాల గడ్డగా మార్చుకుంటుందని హెచ్చరించారు. తమ పార్టీ నేతలు కేసులకు బెదిరిపోరని, 317 జీవోను సవరించే వరకూ పోరాటం ఆగదని చెప్పారు. ప్రజల కోసం చేసిన పోరాటాల్లో ఎమ్మెల్యే రాజా సింగ్‌పై 100కు పైగా కేసులు పెట్టినా బెదరలేదని గుర్తు చేశారు. తాను తొమ్మిది సార్లు జైలుకు పోయానని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా పోవడానికి సిద్ధమేనని అన్నారు.

ఉద్యోగులు అధైర్య పడొద్దు

అనాలోచితంగా తెచ్చిన జీవో 317తో ఉద్యోగుల మధ్య లోకల్, నాల్‌ లోకల్ కొట్లాట పెడుతున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం బండి సంజయ్ చేశారు. దీనిలో లోపాలను సవరించాలని జాగరణ దీక్ష పేరుతో నిరసన చేపడితే నిరంకుశంగా వ్యవహరించి, పోలీసులు దాడి చేశారని, తనను అరెస్టు చేసే సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయని అన్నారు. ఇంకా ఐదుగురు కార్యకర్తలు జైలులోనే ఉన్నారని అన్నారు. ఇష్టానుసారం అర్ధరాత్రి 317 జీవో తెచ్చారని, దీనిలో లోపాల కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , లోకల్, నాన్‌ లోకల్ ఇష్యూలతో మనస్తాపానికి గురై ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. నలుగురు అమాయకులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే ధర్మయుద్ధంలో కేసీఆర్ సంగతి చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడని, చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. కాషాయ జెండా చేతపట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఉద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని, వారి కోసం బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. 

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

జీవో 317 సవరించే వరకూ పోరాటం ఆగదని, ముఖ్యమంత్రిని ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. అంతా పిడికిలి బిగించి బయటకు రావాలని, నాయకుల భరతం పడుదామని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, 317 జీవోను రద్దు చేసి సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు చేసుకునేలా మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.