రాజ్యాంగాన్ని ఖతం చేసింది కాంగ్రెసోళ్లే : ఎన్.రాంచందర్ రావు

రాజ్యాంగాన్ని ఖతం చేసింది కాంగ్రెసోళ్లే : ఎన్.రాంచందర్ రావు
  •     ఎమర్జెన్సీ తెచ్చి రాజ్యాంగాన్ని చంపింది ఇందిరమ్మనే: ఎన్.రాంచందర్ రావు 

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని అడ్డగోలుగా కాలరాసి ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి వాళ్లు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాంచందర్‌‌‌‌ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్‌‌ను పాకిస్తాన్‌‌లో కలపాలని నిజాం కుట్రలు చేస్తే.. ఆపరేషన్ పోలోతో నిజాంను దారికి తెచ్చిన ధీరుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు. 

నెహ్రూను ఎదిరించి రాజ్యాంగాన్ని కాపాడాలని పటేల్ చూస్తే.. కాంగ్రెస్ మాత్రం ఆయన్ను పూర్తిగా మర్చిపోయిందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ప్రియాంకా గాంధీ ఈసీనే బెదిరిస్తున్నారని, ఇక్కడ రేవంత్ రెడ్డి ఓట్లు పోతే ఆధార్ పోతదని జనాల్ని భయపెడుతున్నారని మండిపడ్డారు. 

అసలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులపై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు చేస్తుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్‌‌ను.. అక్కడ కూడా బొందపెట్టే టైం వచ్చిందన్నారు. 

బీజేపీ వైపే పల్లె ప్రజలు ..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా జనం బీజేపీ వైపే ఉన్నారని రాంచందర్ రావు అన్నారు. జీహెచ్‌‌ఎంసీలో ప్రజా సమస్యలపై సర్కార్‌‌‌‌ను నిలదీయాలని, ప్రజల తరఫున కొట్లాడాలని పార్టీ కార్పొరేటర్లకు రాంచందర్‌‌‌‌ రావు పిలుపునిచ్చారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ స్టేట్‌‌ ఆఫీసులో జీహెచ్‌‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఆయన ప్రత్యేక సమావేశమై, సిటీలో పార్టీ, సంస్థాగత అంశాలపై చర్చించారు.