- మేధావులమని చెప్పుకునేటోళ్లు ఓటేస్తలేరు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కన్నా బ్యాలెట్ చాలా శక్తివంతమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. తుపాకులు పట్టుకుని, బాంబులు వేస్తే సమాజం మారదని, ఒక్క ఓటుతోనే రాజ్యాధికారాన్ని మార్చగలమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్బంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను ఆయన సన్మానించి మాట్లాడారు. తమను తాము మేధావులమని చెప్పుకునే కొందరు.. రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూర్చొని ప్రభుత్వాలను విమర్శిస్తారని, పోలింగ్ రోజున మాత్రం ఓటు వేయడానికి ముందుకు రారని ఎద్దేవా చేశారు. ‘‘అమెరికాలో చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అధ్యక్షుడయ్యారు.
మన దగ్గర చాయ్ అమ్మిన వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగారు. ఓటుహక్కు శక్తి వల్లే సాధ్యమైంది’’ అని రాంచందర్ రావు పేర్కొన్నారు. వాజ్‌పేయి హయాంలో ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పడిపోయినా, ఆయన నైతిక విలువలకు కట్టుబడి దిగిపోయారని, మళ్లీ ప్రజలే ఆయన్ను గెలిపించుకున్నారని వివరించారు. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే తదితరులు పాల్గొన్నారు.
