మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేస్తం : రాంచందర్ రావు

మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరేస్తం : రాంచందర్ రావు
  • డబుల్ ఇంజిన్ సర్కార్‌‌‌‌‌‌‌‌కు ఈ ఎలక్షన్లే పునాది: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
  • రాష్ట్రంలో 40 పర్సెంట్ కమీషన్​ దందా నడుస్తున్నదని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రస్తుతం కమీషన్ల కాంగ్రెస్​ పాలన నడుస్తున్నదని, గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. దొందూదొందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని ఆరోపించారు. 

వీళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. బుధవారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్​లో లీగల్ సెల్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో న్యాయవాదులు పార్టీలో చేరారు. వారికి రామచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమీషన్ల దందా 30 నుంచి 40 శాతానికి పెరిగిందని ఆరోపించారు. 

మాది ‘సేవ్  తెలంగాణ- ఓట్ ఫర్ బీజేపీ’ నినాదం..

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని రామచందర్ రావు స్పష్టం చేశారు. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర, బిహార్ ఫలితాలే తెలంగాణలోనూ పునరావృతం అవుతాయన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. 

‘సేవ్  తెలంగాణ– ఓట్ ఫర్ బీజేపీ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి కాలంచెల్లిన చట్టాలను మార్చి, భారతీయ ఆత్మతో కొత్త చట్టాలను తెచ్చిన ఘనత ప్రధాని మోదీదేనని రాంచందర్ రావు వెల్లడించారు.