ఇవాళ, రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

ఇవాళ, రేపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు :  త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ఆది, సోమవారాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్​లు నిర్వహిస్తారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో పాటు రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అటెండ్​ కానున్నారు. 

ఇటీవల నియమించిన పలు ఎన్నికల కమిటీల బాధ్యులకు ఈ సమావేశంలో నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. స్టేట్ ఎలక్షన్ కమిటీ,  వికసిత్ భారత్, శ్రీరామ మందిర్  దర్శన్ అభియాన్ , జాయినింగ్స్ , బెనిఫిషరీస్, గావ్.. గావ్.. జానా, కొత్త ఓటర్లతో సమ్మేళనం తదితర కమిటీల ఇన్​చార్జ్​లు, సభ్యులతో నేతలు చర్చించనున్నట్లు సమాచారం. వాటి పనితీరు, వాటిని బూత్ స్థాయిలోకి తీసుకెళ్లడం, ప్రజలకు వాటిపై అవగాహన కల్పించడంపై నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. 

ఎక్కువ సీట్లలో గెలుపే లక్ష్యంగా..

రాష్ట్రంలో బీజేపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాటిని కనీసం రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో  జాతీయ నాయకత్వం ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా నియమించిన ఎన్నికల కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వ స్కీంలను జనంలోకి తీసుకెళ్లి, లోక్ సభ ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో ప్రజలను బీజేపీ వైపు తిప్పుకోవడానకి ఎలాంటి అడుగులు వేయాలనే దానిపైనే ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్లు, సీట్లను పరిగణనలోకి తీసుకొని ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఏ లోక్ సభ సీటులో ఎలాంటి వ్యూహాలను అమలు  చేయాలనే దానిపై ఇందులో డిస్కస్​చేయనున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవాలి? ఏ నియోజకవర్గం నుంచి ఎవరు టికెట్ ఆశిస్తున్నారు? వారి బలాలు, బలహీనతలు ఏమిటి? ఏ సామాజిక వర్గం ఓటర్లు ఏ నియోజకవర్గాన్ని శాసిస్తారు? వంటి విషయాలను ఈ మీటింగ్​లలో చర్చించనున్నారు.