కమీషన్ల కోసమే కాళేశ్వరం

కమీషన్ల కోసమే కాళేశ్వరం
  • టీఆర్​ఎస్​ సర్కారుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఫైర్​
  • సెక్రటేరియెట్‍ బిల్డింగ్​పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై ఏది?
  • కాళేశ్వరంపై డీపీఆర్‍ లేకుండా రంగుల సినిమా చూపుతున్నరు
  • ఓపెన్​ కాస్ట్​ గనులతో సింగరేణిని బొందలగడ్డగా మారుస్తున్నరు
  • టీఆర్​ఎస్​తో కాంగ్రెస్​ కుమ్మక్కైందని ఆరోపణ
  • కరీంనగర్​, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బీజేపీ నేతల పర్యటన
  • రూ. 35 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష కోట్లకు చేర్చారు
  • గొప్ప ఇంజనీర్​లా ఫీలవుతున్న కేసీఆర్
  • మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి విమర్శ

టీఆర్ఎస్​ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనుకుంటే.. అవినీతిలో రెండో స్థానంలో నిలిపింది. గ్రానైట్, ఇసుక ఇలా సహజ సంపదతోపాటు దేనినీ వదలకుండా రాబందుల్లా దోచుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బుతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినట్లుగానే కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేందుకు ప్రజలు మరో ఉద్యమం చేయాలి. –లక్ష్మణ్

 కరీంనగర్​ టౌన్‍/ పెద్దపల్లి/మంచిర్యాల కోల్​బెల్ట్/మంచిర్యాల, వెలుగు: టీఆర్ఎస్ పాలన పూర్తిగా అవినీతిమయమైందని, స్కీంల పేరిట స్కాంలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనుకుంటే అవినీతిలో రెండో స్థానంలో నిలిపిందని.. గ్రానైట్, ఇసుక ఇలా సహజ సంపదతోపాటు దేనినీ వదలకుండా రాబందుల్లా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో కమీషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బుతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచారన్నారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినట్లుగానే  కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఇందారం, నస్పూర్​ కాలనీ, మంచిర్యాలలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి  మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్​ఎస్​ సర్కార్​ పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన స్కీంలన్నింటిలోనూ స్కాంలే ఉన్నాయని, చీరల పంపిణీ, గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ, చేపల పంపిణీ.. ఇలా ప్రతిదానిలో వాటాలు పంచుకుని దోపిడీ చేస్తున్నారని లక్ష్మణ్​ ఆరోపించారు. రూ. 5 వేల కోట్ల విలువైన సెక్రటేరియెట్​ను కూల్చేసి, రూ. 500 కోట్లతో కొత్తది కడుతామంటున్న కేసీఆర్.. ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సిన రూ. 1,500 కోట్లు ఎందుకు చెల్లించడం లేదని లక్ష్మణ్​ నిలదీశారు. ఇంటర్​ అవకతవకలు, ఆత్మహత్యలపై  కేంద్రం నివేదిక అడిగితే.. దాన్ని కుట్ర అనడం ఏమిటని ప్రశ్నించారు.

కాళేశ్వరంపై రంగుల సినిమా

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లిస్తారు.. ఎంత వ్యయమవుతుందనే పూర్తి డీపీఆర్  లేకుండానే రంగుల సినిమా చూపిస్తున్నారని లక్ష్మణ్​ విమర్శించారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్రానికి ఎలాంటి డీపీఆర్ ఇవ్వలేదని అన్నారు. పరమత సహనం గురించి కేటీఆర్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. పక్కనే పెట్టుకున్న అక్బరుద్దీన్‍ ఒవైసీ హిందువులను, దేవతలను దూషించినా పట్టించుకోకుండా లౌకికవాదం, జాతీయ వాదం గురించి కేటీఆర్​ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సింగరేణి ప్రాంతాలను ఓపెన్​కాస్ట్​ గనులతో విధ్వంసం చేస్తూ బొందలగడ్డగా మారుస్తున్నారని లక్ష్మణ్​ అన్నారు. సింగరేణి సంస్థలో  తీవ్ర అవినీతి, అవకతవకలు కొనసాగుతున్నాయని, వాటిని  బయటకు తీసేందుకు ఇక్కడికి  కేంద్ర మంత్రులను తీసుకువస్తామని లక్ష్మణ్​ ప్రకటించారు.

టీఆర్​ఎస్​తో కాంగ్రెస్​ కుమ్మక్కు

కాంగ్రెస్​ నేతలు టీఆర్​ఎస్​తో కుమ్మక్కయ్యారని, కుంభకోణాలు, అవినీతి గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని లక్ష్మణ్​ నిలదీశారు. కేసీఆర్​, ఉత్తమ్​కుమార్​రెడ్డి ఒకే గూటిపక్షులని, ఇద్దరూ డూప్ ఫైటింగ్​ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, వీరు పొద్దున తిట్టుకొని, రాత్రి మంతనాలు జరుపుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్​లో తల్లీకొడుకులు, టీఆర్​ఎస్​లో తండ్రీకొడుకులు పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. యువరాజుకు పట్టాభిషేకం ఎలా చేయడం అనే ఆలోచన తప్ప మరో ఆలోచన కేసీఆర్​ లేదని ఆయన ఎద్దేవా చేశారు. పాత, కొత్త నేతలమంతా కలిసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.  40 ఏండ్లపాటు సింగరేణి కార్మిక ప్రాంతంలో సేవలు అందించిన కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి వచ్చిన మాజీ ఎంపీ వివేక్​వెంకటస్వామి బీజేపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందని లక్ష్మణ్​ అన్నారు. వివేక్​ నాయకత్వంలో పెద్దపల్లి లోక్​సభ పరిధిలో కమలం వికసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఖర్చు మూడు రెట్లు పెంచారు: వివేక్

బంగారు తెలంగాణ కోసం కాకుండా బంగారు కుటుంబం కోసం కేసీఆర్​ పరిపాలిస్తున్నారని బీజేపీ నేత, మాజీ ఎంపీ జి.వివేక్​ వెంకటస్వామి విమర్శించారు. తన తండ్రి వెంకటస్వామి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సాగునీరందించడం కోసం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పారు.  కానీ కేసీఆర్​ కమీషన్ల కోసం ప్రాణహితను పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. శనివారం మంచిర్యాల జిల్లా ఇందారం, మంచిర్యాల జిల్లా కేంద్రంలో వివేక్​ మాట్లాడారు. రూ.35 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించకుండా.. రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వృథా చేస్తున్నారని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి నుంచి 760 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి వరకు148 కిలోమీటర్ల దూరం గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. అయితే.. కేసీఆర్​ తానేదో గొప్ప ఇంజనీర్ అనుకొంటూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎల్లంపల్లి కి తరలించి అదే నీటిని దిగువకు విడుదల చేయడం, వాస్తుదోషం పేరుతో సెక్రటేరియెట్​ను కూల్చివేయడం కేసీఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనమన్నారు.  తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడంపై అమిత్​షా ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. మున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ను ఓడించి గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

పవర్​ ప్లాంట్​లో స్థానికులకు ఉద్యోగాలేవి?

మంచిర్యాల జిల్లా జైపూర్​లో సింగరేణి ఆధ్వర్యంలో పవర్​ ప్లాంట్​ రావడానికి తన తండ్రి వెంకటస్వామి చొరవే కారణమని వివేక్​ తెలిపారు. సింగరేణి సంస్థ నష్టాల బాటలోకి వెళ్తే కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న సమయంలో వెంకటస్వామి రూ.1,600కోట్ల మారటోరియం ఇప్పించి సంస్థను కాపాడారని చెప్పారు. జైపూర్​ పవర్​ ప్లాంట్​లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇటీవల ఈ విషయాన్ని  గ్రామానికి చెందిన సంతోష్​యాదవ్​, రవి తదితర యువకులు తన దృష్టికి తీసుకవచ్చారన్నారు. సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉందని, ఇక్కడ నెలకొన్న సమస్యలను  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపేలా  కృషి చేస్తానని చెప్పారు. సింగరేణిలో చోటుచేసుకుంటున్న అవకతవకలను బయటపెడుతామన్నారు.

టీఆర్​ఎస్​ నుంచి బీజేపీలోకి చేరికలు

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లకు చెందిన  కార్మికులు, టీఆర్​ఎస్​ నాయకులు నస్పూర్​కాలనీలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో బీఎంఎస్​ కన్వీనర్​ పేరం రమేశ్​ ఆధ్వర్యంలో బీజేపీ, బీఎంఎస్​లో చేరారు.