తెలంగాణ కష్టాలకు కారణం..అయ్యా కొడుకులే : కిషన్ రెడ్డి

తెలంగాణ కష్టాలకు కారణం..అయ్యా కొడుకులే : కిషన్ రెడ్డి
  • వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది: కిషన్​రెడ్డి
  •     అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బీఆర్ఎస్ 
  •     పదేండ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది
  •     బీఆర్ఎస్ మాదిరిగానే రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోంది
  •     ఈ నెల 5న రైతు సత్యాగ్రహం కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు3

హైదరాబాద్, వెలుగు :  అయ్యా కొడుకుల తప్పిదాలతోనే తెలంగాణ కష్టాల పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ చేసిన  తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, ప్రజలు అనేక రకాల దోపిడీకి గురయ్యారన్నారు. వారి అహంకారంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శించారు.

సీఎం కావాలన్న కేటీఆర్ కలలు నెరవేరలేదని, అతనిపై అందరూ జాలిచూపించాలని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ స్టేట్​ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బీఆర్ఎస్ అని కిషన్​రెడ్డి అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక.. ఇతర దేశాలపై ఆధారపడే దశ నుంచి ఆత్మ నిర్భరత ద్వారా ప్రపంచానికి సహాయపడే దశకు భారత్ చేరుకుంటోందన్నారు. దేశంలో పీఎం గరీబ్ కల్యాణ్, ఉజ్వల స్కీమ్, జల జీవన్ , స్వచ్ఛ భారత్ మిషన్ తదితర ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అయ్యాయన్నారు.

2014లో దేశవ్యాప్తంగా 80 జనఔషధి కేంద్రాలుంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 10వేలకు పైనే ఉందని చెప్పారు. గతంలో గ్రామాల్లో పన్నెండున్నర గంటలే కరెంట్ ఉండేదని, ఇప్పుడు ఇరవై రెండున్నర గంటల ఉంటోందన్నారు. చేతి వృత్తుల వారికి, కళాకారులకు చేయూతనందించి, అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకం తీసుకొచ్చామని చెప్పారు.  దేశంలో 28 కోట్ల మంది మహిళలకు బ్యాంకు అకౌంట్లు తెరిచామని, 31 కోట్ల ముద్ర రుణాలు మహిళలకే ఇచ్చామని కిషన్​రెడ్డి తెలిపారు.

స్వయం సహాయక బృందాలకు రూ.8 లక్షల కోట్ల  రుణాలిచ్చామన్నారు. అసెంబ్లీలు, పార్లమెంటులో మహిళల రిజర్వేషన్ ను 33 శాతానికి పెంచిన ఘనత మోదీదేనని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. గరీబీ హఠావో, రోటీ - కపడా - మకాన్ వంటి రాజకీయ నినాదాలు ఇచ్చారని, ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్​కు అభ్యర్థులు దొరకట్లేదు

కాంగ్రెస్, బీఆర్​ఎస్​కు ఎంపీ అభ్యర్థులు దొరకట్లేదని, టికెట్ ఇచ్చిన వాళ్లూ వెనక్కి తగ్గుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన కిసాన్ మోర్చా రాష్ట్ర పదాదికారుల సమావేశంలో కిషన్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కారు మాదిరిగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 5 జిల్లా కేంద్రాల్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహం కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీని గెలిపించేందుకు కిసాన్ మోర్చా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కోరారు. గ్రామస్థాయిలో పర్యటించి రైతు జాగరణ చేయాలని కోరారు.