బీఆర్ఎస్ కు జెండా లేదు... ఎజెండా లేదు

బీఆర్ఎస్ కు జెండా లేదు... ఎజెండా లేదు

హైదరాబాద్: దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి బీఆర్ఎస్ తో ఎన్నికలకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ కు సవాలు విసిరారు. గురువారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ పెట్టిన కొత్త పార్టీ బీఆర్ఎస్ కు జెండా లేదు.. అజెండా లేదు అని విమర్శించారు. అసలు ఏ ఉద్దేశంతో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... ఇవాళ ఏ రకంగా పార్టీ పేరును మారుస్తారంటూ ప్రశ్నించారు. పార్టీ పేరును మార్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉన్నదన్న సంజయ్... పార్టీ పేరును మారుస్తున్నందుకు ఆయనకు ఎంత మాత్రం అధికారంలో ఉండే నైతిక హక్కు లేదని ఫైర్ అయ్యారు. కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. గతంలో జాతీయ పార్టీలను తిట్టిన కేసీఆర్... ఇవాళ ఏ మొఖం పెట్టుకొని జాతీయ పార్టీ అని అంటున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో చెల్లని రూపాయి దేశంలో చెల్లుతుందా అని ప్రశ్నించిన సంజయ్... గేదేకు సున్నమేసినంత మాత్రానా ఆవు కాదు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అక్రమ సంపాదన గురించి ప్రజలకు అర్థమైందని, ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ నాటకమాడుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు కేసీఆర్ కేబినేట్ లో ఒక్క మహిళ కూడా లేరని, కానీ ఇవాళ ఆయన మహిళా సాధికారిత అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలో విమానం కొన్న ఖ్యాతి కేసీఆర్, కేఏ పాల్ కే దక్కిందన్న సంజయ్... త్వరలో ఆ ఇద్దరు నాయకులు కలిసి పని చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.