దూకుడు పెంచిన బీజేపీ..టీఆర్ఎస్ వైఫల్యాలపై ఆర్టీఐ అస్త్రం

దూకుడు పెంచిన బీజేపీ..టీఆర్ఎస్ వైఫల్యాలపై ఆర్టీఐ అస్త్రం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ దూకుడు పెంచింది. 8ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా బీజేపీ ఆర్‌టిఐను ఆయుధంగా వాడుతోంది. సీఎం కేసీఆర్‌ శాసనసభ, శాసనమండలి, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీలు, 2014, 2018 టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేశారు. సీఎం కార్యాలయంతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ, రెవెన్యూ, ఏసీబీ, సంక్షేమ, పంచాయతీరాజ్‌, సాగునీటి, విద్య, వైద్య శాఖలకు సంబంధించి సుమారు 88 దరఖాస్తులను ఆర్‌టిఐ ద్వారా దాఖలు చేశారు. 

రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీని ఆధారాలతో సహా ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టేందుకే దరఖాస్తులు పెట్టామని బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు వివిధ అంశాలపై ఆర్‌టిఐ దరఖాస్తులు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజెపి వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే  బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్‌రెడ్డి వందలకోట్లు ఖర్చు చేసి దేశంలోని వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలపై ఆర్టీఐ దరఖాస్తు పెట్టారు.