బజరంగ్‌‌దళ్​ను నిషేధించే కుట్ర.. అదే జరిగితే కేసీఆర్ సంగతి తేలుస్తం : సంజయ్

బజరంగ్‌‌దళ్​ను నిషేధించే కుట్ర.. అదే జరిగితే కేసీఆర్ సంగతి తేలుస్తం : సంజయ్

బజరంగ్‌‌దళ్​ను నిషేధించే కుట్ర
అదే జరిగితే కేసీఆర్ సంగతి తేలుస్తం: సంజయ్
కాంగ్రెస్ కంటే ముందే బ్యాన్ చేయాలని పోటీ పడుతుండు
జై శ్రీరాం అంటే కేసులు పెట్టి వేధించే రోజులు రాబోతున్నయ్​
గొర్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతున్నరని ఫైర్
రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబానికే సామాజిక న్యాయం: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బజరంగ్ దళ్‌‌పై నిషేధం విధించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌‌తో కేసీఆర్ పోటీ పడుతున్నారని మండిపడ్డారు. భారత మాతా కీ జై అంటే జైల్లో వేస్తారని, జై శ్రీరాం అంటే కేసులు పెట్టి వేధించే రోజులు రాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ సిటీ శివారు నాగోల్‌‌లో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా సమ్మేళనానికి సంజయ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. సంజయ్‌‌తో కలిసి బీసీ డిక్లరేషన్‌‌ను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘బజరంగ్ దళ్‌‌పై నిషేధం విధించాలని ఏ ఒక్క ముస్లిం కూడా కోరుకోవడం లేదు. ఈ సంస్థ ఎక్కడా హింసను ప్రేరేపించలేదు. హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తోంది. అయినా బజరంగ్ దళ్‌‌ను నిషేధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీ పడుతున్నాయి? కాంగ్రెస్ కంటే ముందే నిషేధం విధించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. బజరంగ్ దళ్‌‌ను నిషేధిస్తే సత్తా చూపుతాం. కేసీఆర్ సంగతి తేలుస్తాం”అని హెచ్చరించారు.

లక్షల మందితో బీసీ శంఖారావం 

‘‘బీసీ బంధు ఇవ్వడానికి సీఎంకు ఉన్న అభ్యంతరమేంటో చెప్పాలి. ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలి. అందుకే లక్షల మంది బీసీలతో భాగ్యనగర్ గడ్డపై వచ్చే నెలలో బీసీ శంఖారావం నిర్వహిస్తాం. తెలంగాణలో పేదల కోసం నడిచే రాజ్యం రావాలి. అందుకోసం 5 నెలల సమయం మాకివ్వండి. కేసీఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం’’ అని సంజయ్ అన్నారు. ‘‘కేసీఆర్ కుటుంబ పాలనకు, కాంగ్రెస్ విధానాలకు మాత్రమే మేం వ్యతిరేకం. బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నడు. అగ్రవర్ణ పేదలకు మోడీ ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే రెండేళ్లపాటు రాష్ట్రంలో అమలు చేయకుండా కేసీఆర్​ అడ్డుకున్నడు. కేంద్ర కేబినెట్​లో 27 మంది బీసీలకు మోడీ చోటు కల్పించారు. సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా, లక్ష్మన్​ను రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ బోర్డు సభ్యుడిగా నియమించిన పార్టీ బీజేపీ” అని వివరించారు.

పాతబస్తీ ఎందుకు డెవలప్ అయితలే

‘‘రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న బీసీలకు కేసీఆర్ చేసిందేమిటి? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కుతున్నాడు. 50% బీసీ జనాభా ఉంటే ముగ్గురికి మాత్రమే కేబినెట్​లో చోటిచ్చి బీసీలకు అన్యాయం చేసిండు. కుల వృత్తులను దెబ్బతీస్తున్నడు. అవసరం లేకున్నా రూ.1,600 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియెట్, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం.. బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి” అని సంజయ్ సూచించారు. 4% ముస్లిం రిజర్వేషన్ల వల్ల  జీహెచ్ఎంసీలో 32 మంది కార్పొరేటర్ పదవుల్లో హిందువులకు అన్యాయం జరిగిందన్నారు. ‘‘పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదో ముస్లిం ప్రజలంతా కేసీఆర్‌‌‌‌ను నిలదీయాలి. బీజేపీని ముస్లిం వ్యతిరేక బూచిగా చూపిస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారు. పాతబస్తీ వేదికగా ముస్లింకు జరిగిన అన్యాయంపై నేను లెవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ” అని చెప్పారు.

అధికారం కోసం అర్రులు చాచే వాడిని కాదు : ఈటల

‘‘నేను పార్టీలు మారే వాడిని కాదు. అధికారం కోసం అర్రులు చాచే వాడిని కాదు’’ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  సమ్మేళనంలో పాల్గొన్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను నారాజ్​గా ఉన్నానని, పార్టీ మారుతున్నానని కొన్ని పత్రికలు కట్టుకథలు రాస్తున్నాయి. ఒక్క కర్నాటకలో గెలవగానే అంతా అయిపోయినట్టు ఒక మాయలో పడి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడగొట్టే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ప్రజలు భావిస్తున్నారు. నన్ను కేసీఆర్ బయటికి వెళ్లగొట్టినప్పుడు అక్కున చేర్చుక్క పార్టీ బీజేపీ. నాకు అన్ని రకాలుగా గుర్తింపు ఇస్తున్నది. అమిత్ షా, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ని కలిశా.. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఎలా తేవాలి? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లకు పైగా ఎలా గెలవాలి? అనే విషయాలపై చర్చించాం” అని అన్నారు.

బీసీల ఎజెండాతోనే ఎన్నికలకు: లక్ష్మణ్

రాష్ట్రంలో బీసీల ఎజెండాతోనే ఎన్నికలకు బీజేపీ వెళ్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. బీసీల ఎజెండాతోనే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కాంగ్రెస్ బీసీల ద్రోహి. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న పార్టీ” అని మండిపడ్డారు. ‘‘బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన పార్టీ బీజేపీ. ఛాయ్ అమ్ముకునే పేద కుటుంబానికి చెందిన బీసీ వ్యక్తి నరేంద్ర మోడీని ప్రధానిగా చేసిన చరిత్ర బీజేపీదే. అగ్ర కులాల్లోని పేదలకు రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత మోడీదే. ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాల ప్రజలు తెలంగాణలో స్థిరపడితే.. ఒక్క కలం పోటుతో జీవో ఇచ్చి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి కేసీఆర్. బీసీ క్రీమీలేయర్ పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది” అని తెలిపారు. ‘‘రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబానికి మాత్రమే సామాజిక న్యాయం జరుగుతోంది. 54% బీసీలుంటే అందులో ముగ్గురికి మాత్రమే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులిచ్చారు” అని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో బీసీ ఫెడరేషన్‌‌కు నిధులే లేవు. బీసీల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వారికి చేసిందేమీ లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తెలంగాణలో 34% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఫ్రభుత్వం అందుకు విరుద్ధంగా 23 శాతానికి కుదించి బీసీలు ప్రజా ప్రతినిధుల కాకుండా అన్యాయం చేశారు. కేసీఆర్ బీసీ ద్రోహి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి” అని నిప్పులు చెరిగారు. ‘‘ముస్లింలలో ఉన్న బీసీలకు మేం వ్యతిరేకం కాదు.. కానీ బీసీల పేరుతో బీసీ రిజర్వేషన్లు కాజేస్తూ.. జీహెచ్ఎంసీలో 50 బీసీ సీట్లలో 32 మందిని ఎంఐఎం తన్నుకుపోతే.. కేసీఆర్ ఫ్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తున్నట్లు?” అని నిలదీశారు.

బీసీలను ఆదుకునేందుకు పైసా ఇస్తలే

‘‘వేల కోట్లు సంపాదిస్తున్న కేసీఆర్ కుటుంబం.. బీసీలను పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన వాటా నిధులను ఖర్చు చేయడం లేదు. బీసీలను ఆదుకునేందుకు పైసా ఇవ్వడం లేదు” అని సంజయ్ మండిపడ్డారు. దళిత బంధులో 30 శాతం కమీషన్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకుంటు న్నారని సాక్షాత్తు సీఎం చెప్పారన్నారు. దళిత సీఎం హామీని విస్మరించారని, కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కర్నాటకలోని పరిస్థితులు వేరు.. తెలంగాణలోని పరిస్థితులు వేరని అన్నారు. ‘‘భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు వెళ్లే దమ్ము కేసీఆర్​కు లేదు.. ముస్లిం ల అభివృద్ధి గురించి మాట్లా డిన పార్టీ బీజేపీ. ముస్లిం మహిళల మనోభా వాలను కాపాడేందుకు ట్రిపుల్ తలాక్‌‌ను రద్దు చేసిన పార్టీ బీజేపీ. ట్రిపుల్ తలాక్‌‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐ ఎం’’ అని సంజయ్ ఆరోపించారు.