కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ ఉగాది ట్వీట్

కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ ఉగాది ట్వీట్

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ట్వీట్ చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా కేసీఆర్ పరిపాలన తీరును ఎండగట్టారు. బండి సంజయ్ ట్విట్టర్ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు. సాధారణంగా ఉగాది సందర్భంగా చాలామంది తమ రాశుల గురించి పండితుల వద్ద చెప్పించుకుంటారు. ఈ ఏడాది జాతక చక్రం ఎలా ఉంటుంది..? ఎంత సంపాదిస్తారు..? ఎంత ఖర్చు పెడుతారు..? వంటి విషయాలను జాతకం చెప్పించుకునే వారికి, వివిధ రాశుల వారికి పండితులు చెబుతుంటారు. ఈ తరహాలోనే కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన తీరును బండి సంజయ్ తనదైన స్టైల్లో ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 

ఆదాయం     : కల్వకుంట్ల కుటుంబానికి 
వ్యయం          : తెలంగాణ రాష్ట్రానికి
అవమానం     : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు 
రాజపూజ్యం  : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు!!

తుస్.., పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయతీ లెక్క తేలుడు తరువాయి.. పతనం ఇగ షురువాయే’ అంటూ బండి సంజయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

మిలియన్ మార్చ్ తరహా.. నిరుద్యోగ మార్చ్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన 30 లక్షల మంది విద్యార్థులతో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని సంచలన ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. మార్చి 22వ తేదీ బుధవారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్ తరహాలో.. 30 లక్షల మంది స్టూడెంట్స్ తో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరతామని స్పష్టం చేశారాయన. 

పేపర్ లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు సాధించిందేమీ లేదని.. సీఎం సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ గా సిట్ దర్యాప్తు ఉందని ఎద్దేవ చేశారాయన. టీఎస్ పీఎస్ పేపర్ లీక్ కేసులో తాము సిట్ దర్యాప్తును ఒప్పుకోవట్లేదని.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నయీం కేసు, మియాపూర్ భూకుంభకోణం,  డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.