హైదరాబాద్: తాను చావుకైనా భయపడనని.. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే కేసులకు ఎందుకు భయపడుతానని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని, వెనక్కిపోనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాం నగర్‌లో రోడ్ షోలో పాల్గొన్న ఆయన.. త్వరలో కేసీఆర్ అవినీతి ప్రభుత్వం పడిపోతుందని.. బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.
జీహెచ్ఎమ్‌సీ ఎన్నికల తర్వాత అవినీతితో కూరుకుపోయిన TRS ప్రభుత్వం పడిపోతుందని.. కేసీఆర్ జైలు కి పోవడం పక్కా అని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ వాళ్లు పెట్టే మీటింగులకు ఎవరూ రావట్లేదని, ప్రజలకి డబ్బులిచ్చి బహిరంగ సభలకి వేర్వేరు జిల్లాల నుండి రప్పిస్తున్నారని, ఒక్కో డివిజన్ కి 5 కోట్ల రూపాయలు పంచాలని చూస్తున్నారన్నారు. ఆదివారం.. హైదరాబాద్ కి అమిత్ షా వస్తుండడంతో TRS వాళ్ళకి భయం పట్టుకుందని అన్నారు. TRS వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకొని.. బీజేపీ కి ఓటు వేయాలని అన్నారు సంజయ్
తెలంగాణ క్యాబినెట్లో మంత్రులంతా దద్దమ్మలేనని ఘాటైన విమర్శలు చేశారు సంజయ్. లక్ష ఉద్యోగాలివ్వలేడు కానీ… హైదరాబాద్ లో లక్ష హోర్డింగ్స్ పెట్టుకున్నారని అన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి వరద బాధితులకు రూ.10వేల వరద సాయాన్ని ఆపింది కేసీఆరేనని అన్నారు. హిందు దేవుళ్ళని కించపరిచే MIM పార్టీ కి సీఎం కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నాడని అన్నారు సంజయ్. 80 శాతం ఉన్న హిందువుల కోసం మాట్లాడితే బీజేపీ ని మతతత్వ పార్టీ అంటున్నారని, హిందుగాళ్లు, బొందుగాళ్లు కరీంనగర్ లో బొంద పెట్టినమని ఈ సందర్భంగా అన్నారు సంజయ్.
కొంతమంది పోలీస్ అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వం మోచేతి నీళ్లు తాగుతున్నారని, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని సంజయ్ అన్నారు.
