కేసీఆర్ కొత్త పార్టీపై బండి సంజయ్ ఫైర్ 

కేసీఆర్ కొత్త పార్టీపై బండి సంజయ్ ఫైర్ 
  •     టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ మాతో రండి 
  •     కొడుకును సీఎం చేసి, మిమ్మల్ని అవమానిస్తడు  
  •     పద్మశాలీలకు ఖాదీ బోర్డు చైర్మన్ పదవియ్యాలని డిమాండ్ 

కోరుట్ల రూరల్, వెలుగు:  సీఎం కేసీఆర్ నడిపేది కిసాన్ సర్కార్ కాదని, అది ఆబ్కారీ సర్కార్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని కేసీఆర్ అంటున్నారని, కానీ అది ‘అబ్ కీ బార్.. ఆబ్కారీ సర్కార్, లిక్కర్ సర్కార్’ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు వచ్చిన ఇతర రాష్ట్రాల నేతలంతా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ లీడర్లేనని విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్ వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ.. కొడుకును సీఎం చేయాలని చూస్తూ కేసీఆర్ మిమ్మల్ని అవమానిస్తున్నారు.

మీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే.. మాతో కలిసి రండి” అని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ లో ఎంతో మంది ఎమ్మెల్యేలకు సీఎం అయ్యే అర్హత ఉన్నప్పటికీ, కేసీఆర్ మాత్రం తన కొడుకును సీఎం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు.‘‘లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ బిడ్డ కవితను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఆమె ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? చాకలి ఐలమ్మ వారసురాలా? ఆమెను అరెస్ట్ చేస్తే ప్రజలెందుకు నిరసన తెలపాలి? ఎందుకు విధ్వం సృష్టించాలి?” అని ప్రశ్నించారు. టీఆర్ఎస్​లో  తెలంగాణ పేరును తొలగించిన కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. 

నిరుద్యోగులు గోసపడుతున్రు 

కోరుట్లలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని ప్రజలను అడిగారు. ప్రధాని మోడీ ఒక్క నెలలోనే 1.46 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ మాత్రం గత నాలుగేండ్లలో నోటిఫికేషన్లు ఇవ్వడమే తప్ప ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. తెలంగాణ యువత చేసిన పాపమేంటని ప్రశ్నించారు. లక్షల్లో అప్పులు చేసి కోచింగ్ తీసుకుని, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు  ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో గల్ఫ్ నుండి వచ్చిన హిందూ యువకులను తరలించి ఒక్కొక్కరి దగ్గర 15 నుండి 20 వేల రూపాయలు వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గం వారికి మాత్రం ఉచితంగా బాదం, పిస్తాలు పెట్టి పోషించిందని ఆరోపించారు. తెలంగాణలో  పోలీసులకు  ప్రమోషన్లు ఇవ్వడంలేదని,  ఎలాంటి  బెనిఫిట్స్ కల్పించడం లేదని, కేసీఆర్ ను, టిఆర్ఎస్ వాళ్లను ముందు ముందు పోలీసులే ఉరికించి కొడ్తారని పేర్కొన్నారు.  

ఖాదీ బోర్డుపై హక్కు పద్మశాలీలదే.. 

కేసీఆర్ పాలనలో కుల వృత్తులన్నీ ధ్వంసమయ్యాయని సంజయ్ మండిపడ్డారు. ఖాదీ బోర్డు స్థలాల్లో కమర్షియల్, పెట్రోల్ బంకులు వెలుస్తున్నాయని, అమ్ముకోడానికి, లీజుకు తీసుకోవడానికి ఖాదీ బోర్డును వాడుకుంటున్నారని మండిపడ్డారు. పద్మశాలీలకే ఖాదీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ లో 50 మంది యువజన సంఘాల సభ్యులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించారు.  

కేసీఆర్ చెల్లని రూపాయి.. 

తెలంగాణలో కేసీఆర్ చెల్లని రూపాయిగా మారారని, ఆయన ముఖం చూసి ఓట్లేసే రోజులు పోయాయని సంజయ్ అన్నారు. ఏడాది నుంచి ప్రజల కోసం తాను పాదయాత్ర చేస్తున్నానని, పేదోళ్ల కష్టాలు, బాధలు తెలుసుకుంటున్నానని తెలిపారు. పాదయాత్రలో తెలుసుకున్న అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై రైతులకు సబ్సిడీ ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుబంధు పేరుతో అన్ని సబ్సిడీలను కట్ చేస్తున్నారని విమర్శించారు.

గల్ఫ్ కార్మికుల సమస్యలు ఇంకా అలానే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని, ఐలాపూర్ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద భారీగా నిధులను మంజూరు చేశామని వెల్లడించారు. కేంద్రం నిధులు ఇస్తుంటే.. కేసీఆర్ తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు.