ఉద్యోగ సంఘాల నేతలకు నియత్ లేదు

ఉద్యోగ సంఘాల నేతలకు నియత్ లేదు

హైదరాబాద్, వెలుగుఉద్యోగ సంఘాల నేతల స్వార్థ ప్రయోజనాలకు సాధారణ ఉద్యోగులు బలవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్ కు సహకరించారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల కడుపుకొట్టేందుకు సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్లి భోజనం చేసి వచ్చారని, ఇదేనా ఎంప్లాయీస్​ యూనియన్​ లీడర్ల నీతి అని ప్రశ్నించారు. ఉద్యోగులంతా తమ వెనకాలే ఉన్నట్లు కొందరు యూనియన్​ లీడర్లు ఫీలవుతున్నారన్నారు. కొందరు లీడర్లు తోటి ఉద్యోగుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

మంత్రి పదవికి రాజీనామా చేయాలి

ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ఓ నాయకుడు మంత్రి పదవి పొందినా, తోటి ఉద్యోగుల బాగోగులు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఏపీలో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను ఆరేండ్లయినా సొంత రాష్ట్రానికి తీసుకురాలేకపోయారన్నారు. ఉద్యోగుల కోసం పని చేయని ఆ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పదవులు పొందేందుకే ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారని, ఉద్యోగుల కోసం పని చేసేందుకు కాదని అన్నారు. పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ఉద్యోగులను మోసం చేశారని, ఐఆర్ కూడా ఇవ్వడం లేదన్నారు. వెంటనే పీఆర్సీ అమలు చేయకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని లక్ష్మణ్ హెచ్చరించారు.

నెలనెలా జీతాలు చెల్లించలేని స్థితి

రాష్ట్రంలోని ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేని స్థితిలో రాష్ట్రం ఉందని లక్ష్మణ్​ అన్నారు. ఆరేండ్లుగా ఒక్క ఉద్యోగాన్ని కూడా టీఆర్ఎస్ సర్కార్ ఇవ్వలేకపోయిందని, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఇవ్వడానికి కొలువులు లేవు కాని, కల్వకుంట్ల ఇంట్లో మాత్రం రాజకీయ కొలువులు వచ్చాయన్నారు. ప్రతి నిరుద్యోగికి రూ.3,016 భృతి ఇస్తామని చెప్పిన సర్కార్ మాట తప్పిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను ఎత్తేస్తామని సీఎం కేసీఆర్ ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికలు ఉన్న జిల్లాల్లోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఎన్నికలు లేకపోతే రైతుబంధు లేదు, పెన్షన్లు అందవు, కల్యాణలక్ష్మీ ఇవ్వరని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం దివాళా తీసిందని, రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోసమే కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడ్తున్నారని
విమర్శించారు.