
- కర్నాటక సర్కారుతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలి: ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ, కర్నాటక ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడం అన్యాయమన్నారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. జూరాల, నాగార్జునసాగర్, పాలమూరు- రంగారెడ్డి వంటి అనేక ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గిపోతుందని తెలిపారు.
హైడల్ పవర్, సాగు నీరు కోసం కృష్ణా నదిపై ఆధారపడిన తెలంగాణకు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో నష్టం జరిగే అవకాశం ఉన్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కర్నాటక, తెలంగాణరాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా.. తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.