
- బీసీలపై కాంగ్రెస్‌కు ప్రేమ ఉంటే.. పొన్నం లేదా మహేశ్‌ను సీఎం చేయాలి
- అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయను
- మీడియాతో చిట్‌చాట్‌లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్‌రావు
హైదరాబాద్, వెలుగు: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. బీజేపీలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ‘నేను కూడా బీసీ (బ్రాహ్మణ కమ్యూనిటీ) నే’ అని చమత్కరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. ప్రభుత్వం పేదల ఇండ్లను, ఆలయాలను కూల్చుతున్నదని, ఇలాగే చేస్తే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని హెచ్చరించారు.
శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ తో కలిసి రాంచందర్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉందని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ కాస్త వీక్‌గా ఉన్న సౌత్ జిల్లాలపై ఫోకస్ పెడ్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని చెప్పారు.
తాను అధ్యక్షుడిగా వచ్చి 18 రోజులే అయ్యిందని, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేండ్లు ఉందని, ఈ సమయంలో పార్టీలో చేరికలు ఉంటాయని తెలిపారు. రోహిత్ వేముల కేసులో భట్టి విక్రమార్క తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, దీనిపై చట్టపరంగా పోరాడుతానని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీకి చాలామంది అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. గోషామహల్ సమస్య ఎప్పటికీ ఉంటుందని, రాజాసింగ్ ఇష్యూ జాతీయ నాయకత్వం పరిధిలోనిదని స్పష్టం చేశారు.
రాహుల్‌కు గాయత్రీ మంత్రం వచ్చా?
పార్టీ కార్యవర్గ విస్తరణకు చాలా ఒత్తిళ్లు వస్తున్నాయని, కాంగ్రెస్ మాదిరిగా ‘జంబో టీం ఉండదు’ అని రాంచందర్‌రావు తెలిపారు. అధిష్టానం చెప్పినట్లు కార్యవర్గం ఉంటుందని, పార్టీ పదవి కోసం పోటీ పడొద్దని నేతలకు సూచించారు. పోస్ట్ వచ్చినంత మాత్రాన పెద్దవాళ్లు కాదని, గత ఐదేండ్లుగా తనకు పార్టీ పదవి లేదని, అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిని అయ్యానని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి ‘భాస్కర్ అవార్డ్’ ఇవ్వాలని తాము ప్రపోజ్ చేస్తామని ఎద్దేవా చేశారు.
‘‘రాహుల్‌గాంధీ పార్శీ.. తల్లి క్యాథలిక్.. అసలు రాహుల్‌గాంధీకి గాయత్రీ మంత్రం వచ్చా? సంధ్యా వందనం చేస్తారా?’’ అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎంబీసీ కార్పొరేషన్‌కు ఇచ్చిన వెయ్యి కోట్లు ఎక్కడికి పోయాయని అడిగారు. బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతిని చేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నందుకు సంతోషమని, పొన్నం ప్రభాకర్ లేదా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం చేయాలని తాము కోరుతున్నామని అన్నారు.
కులగణనలో కులాల లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కేంద్రంపై నెట్టవద్దని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ట్రాయ్ పరిధిలోనిదని, కేంద్రం పరిధిలోని ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో ఒక్క అధికారి దగ్గరే 150 కోట్లు దొరికాయని, కానీ ఒక్క పొలిటీషియన్‌ను కూడా టచ్ చేయలేదని విమర్శించారు.