రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
  •     నెహ్రూ నుంచి ఇందిర దాకా అంబేద్కర్​ను అవమానించారు
  •     బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
  •     ఓటర్ల లిస్టులో రోహింగ్యాలను చేర్పిస్తే ఊరుకోబోమని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్  పార్టీదేనని, నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు అడుగడుగునా అంబేద్కర్ ను అవమానించినవారేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్  గాంధీకి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు.

 ‘‘1951 వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం లేనప్పుడు.. అవసరమైతే రాజ్యాంగాన్ని పక్కనబెట్టాలని నెహ్రూ కామెంట్ చేశారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను కాంగ్రెస్  నేతలు అడుగడుగునా అవమానించారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ఖూనీ చేసింది ఇందిరా గాంధీ కాదా? రాజీవ్  గాంధీ కూడా షాబానో కేసులో ఓట్ల కోసం సుప్రీంకోర్టు తీర్పునే మార్చివేశారు. మోదీ వచ్చాకే రాజ్యాంగానికి, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌కు నిజమైన గౌరవం దక్కింది” అని రాంచందర్  వ్యాఖ్యానించారు. 

ఓటు హక్కు భారత పౌరులకే ఉండాలని, కానీ కాంగ్రెస్  నేతలు లోకల్ లీడర్ల సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో అక్రమంగా బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను ఓటర్ల లిస్టులో చేర్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ ఓట్లను, చనిపోయిన వారి పేర్లను ఈసీ తొలగిస్తుంటే రాహుల్ గాంధీకి భయం పట్టుకుందన్నారు. అక్రమ చొరబాటుదారులను ఓటర్ల జాబితాలో చేర్పిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్,  పార్టీ నేతలు బూర నర్సయ్యగౌడ్, చింతల రాంచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఎన్​వీ సుభాష్, గౌతమ్ రావు, బండ కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.