మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: రాంచందర్రావు

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం: రాంచందర్రావు
  • ..రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి: రాంచందర్​రావు
  • హామీలన్నీ అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వెంటాడుతాం
  • నల్గొండ జిల్లాలో పర్యటించిన  బీజేపీ స్టేట్ చీఫ్

నల్గొండ అర్బన్/చౌటుప్పల్, వెలుగు: మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పార్టీ స్టేట్ చీఫ్​గా నియమితులైన తర్వాత తొలిసారి నల్గొండకు వచ్చిన రాంచందర్​రావుకు పార్టీ నేతలు, కార్యకర్తలు మర్రిగూడ బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం నల్గొండలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్​లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఇస్తే ఊరుకునేది లేదు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తే స్వాగతిస్తాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేదాకా వెంటాడుతాం. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్​కు ప్రజలు అవకాశం ఇవ్వాలి. నల్గొండ నా జన్మభూమి. చైతన్యానికి మారుపేరు. ఉద్యమాలు, త్యాగాలకు పెట్టింది పేరు. ఇలాంటి జిల్లాలో కుటుంబ పాలనకు ఫుల్​పెట్టిస్తాం. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ షేర్ పెరిగింది’’అని రాంచందర్ రావు అన్నారు.  

పోరాటానికి సిద్ధం కావాలి

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. ‘‘రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేయాలి. ప్రతి నెల కేంద్ర ప్రభుత్వమే రేషన్ కింద 5 కిలోల బియ్యం ఇస్తున్నది. రైతు బంధు, రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 9 లక్షల టన్నుల యూరియా అడిగితే.. కేంద్రం 12 లక్షల టన్నులు పంపింది’’అని రాంచందర్ రావు అన్నారు. 

అనంతరం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు. సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు.