
కరీంనగర్ టౌన్, వెలుగు: మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్, 8వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాలను జనరల్ హాస్పిటల్‌లో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు అన్ని జనరల్ హాస్పిటళ్లలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
అంతకుముందు కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీల్లో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలోని విద్యార్థులకు సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జడ్పీలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినితానాజి వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఎంహెచ్‌వో వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, డీఈవో మొండయ్య, జడ్పీ సీఈవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.