
జగిత్యాల టౌన్, వెలుగు: గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దేవాదాయ కమిషనర్ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ధర్మపురిలోని నది తీర ప్రాంతం, వెల్గటూరు మండలం కోటిలింగాలలోని పుష్కర ఘాట్లను కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2027 జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునర్నిర్మాణంపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు తక్కువ సమయం ఉన్నందున మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని తెలిపారు.