
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ అన్నారు. ఆర్టీసీ చార్జీలు, కరెంట్ చార్జీలు సహా అనేక రకాల పన్నులతో ఎంతో భారం మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంలోని కుటుంబ, అవినీతి పాలన పీడ విరగడైపోవాలని, పాడిపంటలు, ఆయురారోగ్యాలతో అందరూ ఆనదంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. శుక్రవారం ఆయన తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన సనాతన ధర్మం ప్రపంచానికి మంచి మార్గాన్ని చూపించిందని, మన సంస్కృతి సంప్రదాయాలు మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయని చెప్పారు. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు రుచులు ఉన్నట్టుగానే, జీవితంలోనూ సుఖదుఃఖాలు, కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తుంటాయన్నారు. ఉగాది స్ఫూర్తితో కష్టాలన్నింటినీ ధైర్యంగా దాటే శక్తి ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
తెలంగాణలో మరిన్ని సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయండి
రాజ్‌నాథ్ సింగ్‌కు బండి సంజయ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో మరిన్ని సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర జల వనరుల శాఖ అడ్వైజర్ వెదిరె శ్రీరాంతో కలిసి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని సంజయ్ కలిశారు. ఈ సందర్బంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలు, ప్రజా సంగ్రామ యాత్ర గురించి సంజయ్‌ని అడిగి తెలుసుకున్నారు.