వరంగల్ అభివృద్ధి కోసం నోరెత్తని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వరంగల్ అభివృద్ధి కోసం నోరెత్తని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

వరంగల్ : బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ చేసిన ధర్నాల్లో నిరుపేదలెవరూ లేరని అందరూ రాజకీయ నాయకులేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి అన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం కనీసం నోరెత్తని ఎమ్మెల్యేలు.. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి మూడేళ్లు గడిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చిందని, ఇది వరంగల్ ప్రజా ప్రతినిధుల నిర్వాకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ ఫ్యాక్టరీ మంజూరు చేసినప్పుడు భూమి కేటాయించి ఉంటే దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడుతుందని 2018 ఎన్నికల సభలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుపడి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టొచ్చు కదా అని అన్నారు. బయ్యారంలో 15% నుండి 40% వరకే ఉక్కు లభ్యత ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక పేర్కొందని అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చెప్పారని అన్నారు.