
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. కేసీఆర్ సర్కార్ తొమ్మిదేండ్లలో నేరవేర్చని హామీలు, కుటుంబ అవినీతి, నియంత పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో “ప్రజా గోస.. బీజేపీ భరోసా” పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో.. 11 వేల శక్తి కేంద్రాల్లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు 15 రోజుల పాటు కొనసాగనుంది. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఓ వైపు ఎండగడుతూనే ఇంకో వైపు మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై జనానికి అవగాహన కల్పించడం, ఇంటింటికీ కమలం గుర్తును తీసుకెళ్లడం ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఎజెండా అని బీజేపీ నేతలు చెప్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ 11 వేల కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసింది. 15 రోజుల్లో 11వేల వీధి సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. మెదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా 800 కార్నర్ మీటింగ్స్ కు ప్రణాళికలు చేశారు. మార్కెట్ యార్డ్స్, గ్రామ చౌరస్తా, జన సమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బీజేపీ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తోంది. కనీసం 200 మంది స్థానికులు పాల్గొనేలా ప్లాన్ చేసింది. “ప్రజా గోస.. బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా నిర్వహించే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ఇంటింటికి కర పత్రాలను పంపిణీ చేయనున్నారు.
* కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్ పల్లి ఎక్స్ రోడ్డులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాల్గొన్నారు.
* సనత్ నగర్ నియజకవర్గంలో ఇవాళ సాయంత్రం ఏర్పాటు చేయబోయే కార్నర్ మీటింగ్స్ లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ బన్సల్ పాల్గొననున్నారు.
* శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్స్ లో మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఇన్ చార్జ్ మురళీధర్ రావు పాల్గొంటారు.
ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ల ప్రారంభానికి నియోజకవర్గాల వారీగా హాజరయ్యే జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల జాబితాను గురువారం రాష్ట్ర పార్టీ ప్రకటించింది.