టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే కారణం

టీఎస్‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే కారణం

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌‌‌‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి రాష్ట్ర ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ విమర్శించింది. దీనికి బాధ్యతగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. టీఎస్‌‌‌‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, అందులో భాగంగా కమిషన్ చైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని స్పష్టంచేసింది. టీఎస్‌‌‌‌పీఎస్పీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది. పరీక్షల రద్దుతో కోచింగ్, హాస్టల్ వసతి పేరుతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, వారందరికి రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లోపే ఆయా పరీక్షలన్నీ నిర్వహించి ఉద్యోగ నియమకాల భర్తీని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాలన్నీ ఇతరులకు ఎట్లా బదిలీ అయ్యాయి? దీని వెనుకాల ఎవరున్నారు? చైర్మన్‌‌‌‌పై ఏమైనా ఒత్తిడి ఉందా? కింది స్థాయి సిబ్బందికి నేరుగా ప్రగతి భవన్ కు లింకులున్నాయా? అనే విషయాలపై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించింది. రాష్ట్రంలో ఐటీ చట్టం అమలుతోపాటు టీఎస్‌‌‌‌పీఎస్సీ అక్రమాలపై విచారణ కోసం న్యాయపోరాటం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సమావేశంలో టాస్క్‌‌‌‌ఫోర్స్ కమిటీ కన్వీనర్, టీఎస్‌‌‌‌పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, సభ్యులు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మహిళా మోర్చా జాతీయ పాలసీ రీసెర్చ్ కన్వీనర్ కరుణా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.


సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

శనివారం గవర్నర్ తమిళి సైని కలవాలని టాస్క్‌‌‌‌ఫోర్స్ కమిటీ నిర్ణయించింది. టీఎస్‌‌‌‌పీఎస్సీ చైర్మన్ సహా సభ్యులందరినీ బర్తరఫ్ చేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరనుంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల రద్దు కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గవర్నర్‌‌‌‌‌‌‌‌కు అందజేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్ణయించింది.