టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే : తరుణ్ చుగ్​

టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం  బీజేపీనే : తరుణ్ చుగ్​

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ సహా మునుగోడు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ లీడర్​తమ తమ హామీలను నిలబెట్టుకోవాలని, 15 రోజుల్లోగా చేస్తామన్న అభివృద్ధిని చేసి చూపించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. మెజార్టీ 10,309 ఓట్ల మాత్రమే రావడం తెలంగాణ ప్రజలలో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు, 10 మంది ఎంపీలు, మొత్తం పోలీసు వ్యవస్థను మునుగోడులో మొహరించారు. కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభలు పెట్టారు. పథకాలు రాకుండా చేస్తమని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. దాడులకు పాల్పడి తప్పుడు కేసులు బనాయించారు” అని ఆరోపించారు.

కాంగ్రెస్ కంచుకోట లాంటి మునుగోడులో ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేదంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టమవుతోందని తెలిపారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీ దేనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. టీఆర్​ఎస్​అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం సహా మంత్రులు ప్రచారం చేసిన చోట్ల బీజేపీ ఆధిక్యం సాధించడం చూస్తే టీఆర్ఎస్ పట్ల ప్రజలకున్న అపనమ్మకాన్ని తెలియజేస్తోందని చెప్పారు. మొత్తం అసెంబ్లీని, అధికారాన్ని ఉపయోగించినా స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ సాంకేతికంగా విజయం సాధించినప్పటికీ, నైతిక 
విజయం మాత్రం బీజేపీదే అన్నారు.