సాధారణ నేత నుంచి అంచెలంచెలుగా..కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

సాధారణ నేత నుంచి అంచెలంచెలుగా..కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం

కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ హైకమాండ్ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలుగురాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చింది. బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో  కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించింది. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. 2010-2014 లో ఉమ్మడి ఏపీకి  అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 16 వరకు తెలంగాణకు అధ్యక్షుడిగా ఉన్నారు.

జనతాపార్టీ యువనాయకుడిగా

1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.  1977లో జనతా పార్టీలో యువనాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. 1982 నుంచి 1983 వరకు అతను బీజేపీ ఏపీ యువమోర్చా రాష్ట్ర కోశాధికారిగా, 1983 నుంచి1983 వరకు బీజేపీ  రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2002 నుంచి 20025 వరకు బీజేపీ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఉమ్మడి ఏపీకి అధ్యక్షుడిగా

2004 లో హిమాయత్ నగర్ నుంచి, 2009, 2014లో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నుంచి 14 వరకు ఉమ్మడి ఏపీ బీజేపీ  అధ్యక్షుడిగా, 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణలో పోరుయాత్ర చేపట్టారు. 2016 నుంచి 2018 వరకు  తెలంగాణ శాసనసభాపక్ష నేతగా ఉన్నారు. 2019లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021 నుంచి  కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు.