
జర్నలిస్ట్ లపై కాదు..కరోనా పై తప్పుడు ప్రచారం చేస్తున్న సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ పై తప్పుడు వార్తల్ని ప్రచురించారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రిపోర్టర్ పై కేసు నమోదైంది. ఈ కేసుపై బండి సంజయ్ స్పందించారు. కక్షసాధింపు చర్యలకు అణచివేతకు సీఎం కేసీఆర్ పర్యాయపదంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు నమోదు చేయడం కాదని, కరోనా పై అసత్య ప్రకటనలు చేసినందుకు కేసీఆర్ పై కేసులు నమోదు చేయాలని అన్నారు.
పారాసిటమాల్ టాబ్లెట్ మింగితే కరోనా రాదని, 20 డిగ్రీల సెల్సియస్ వేడిలో కరోనా వైరస్ బతకదని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సీఎం కేసీఆర్ తప్పుదారి పట్టించారని, రాష్ట్ర మంత్రులు సైతం వేడి నీళ్లు తాగితే కరోనా రాదని మభ్యపెడుతున్నారని విమర్శించారు. పత్రికా యాజమాన్యాలకు, విలేకరులకు కరోనా రావాలని శపించిన కేసీఆర్ వైఖరిని ప్రజలు గమనించారన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో విలయతాండవం చేస్తున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అదే విషయాన్ని ప్రస్తావించిన జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ లపై నమోదు చేసిన అక్రమ కేసుల్ని కొట్టివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.