టీచర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి బెదిరించిండు

టీచర్లకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి బెదిరించిండు

రాష్ట్రంలో స్కూళ్ల  సంఖ్య తగ్గి.. బార్ల  సంఖ్య పెరిగిపోయిందని  ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీచర్లకు  ఇచ్చిన హామీలను  సర్కారు మరిచిపోయిందన్నారు. PRC కోసం తాము  పోరాడుతున్నామని  చెప్పారు. ఉపాధ్యాయ  దినోత్సవం సందర్భంగా.. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి   రాధాకృష్ణన్  ఫొటోకి  పూలమాల వేసి  నివాళులర్పించారు సంజయ్. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షురాలు  డీకే అరుణ  కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా  టీచర్లను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ.. చాలా మంది టీచర్లతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు గౌరవమని అన్నారు. తన తండ్రి కూడా ఒక టీచర్ అని, చిన్నప్పటి నుంచి దేశం, ధర్మం పట్ల ఆలోచించే విధానాన్ని తన తండ్రి వల్లనే నేర్చకున్నానని బండి సంజయ్ చెప్పారు. తన తండ్రి ఉపాధ్యాయుడు కాబట్టే మంచి క్రమశిక్షణతో ఈ స్థాయికి ఎదిగామని అన్నారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దే శక్తి ఉపాధ్యాయులకు ఉందన్నారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో స్కూళ్ల డెవలప్‌మెంట్‌ను పట్టించుకోవడం లేదని, యువత చదువుకుంటే రాజకీయంగా జ్ఞానం పెరిగి తనపై తిరగబడతారని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. అందుకే గొర్రెలు, బర్రెలు ఇచ్చి మభ్యపెడుతున్నారని అన్నారు. బడుల బదులు బార్లు ఎక్కువైపోయాయని, రాష్ట్రంలో కిలోమీటర్‌‌కు ఒక వైన్‌ షాప్, బార్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీచర్లకు బీజేపీ అండ 

విద్యార్థులకు ధైర్యం చెప్పే ఉపాధ్యాయులే భయపడితే సమాజంలో మరెవరూ ధైర్యంగా పోరాడలేరని బండి సంజయ్ అన్నారు. కానీ పీఆర్సీ విషయంలో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీచర్లకు సీఎం కేసీఆర్‌‌ ఫోన్‌ చేసి మరీ ఉపాధ్యాయ సంఘాలను రద్దు చేస్తానని బెదిరించారని ఆరోపించారు. దీంతో టీచర్లు భయపడి టీచర్లు టీఆర్‌‌ఎస్‌కు ఓట్లు వేశారని అన్నారు. అయితే టీచర్లంటే సీఎం కేసీఆర్‌‌కు భయం ఉంది కాబట్టే ఎలక్షన్ డ్యూటీ వేయకుండా దూరంగా పెట్టారని గుర్తు చేశారు. సమాజాన్ని జాగృతం చేయాల్సింది టీచర్లేనని, వారికి బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ చెప్పారు.