ఒక్క ఛాన్స్ ఇస్తే బెంగాల్‌ రాత మారుస్తా

ఒక్క ఛాన్స్ ఇస్తే బెంగాల్‌ రాత మారుస్తా

ఖరగ్‌పూర్: బెంగాల్‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే నిజమైన పాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో బెంగాల్ వెనుకబడిపోయిందని ఖరగ్‌పూర్‌‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఆరోపించారు. ‘బెంగాల్ ప్రజలు దీదీకి 10 సంవత్సరాల సమయం ఇచ్చారు. కానీ ఆమె రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఆమె పాలనలో విధ్వంసం, హింస చెలరేగడం తప్ప జరిగిన అభివృద్ధి శూన్యం. బెంగాల్‌‌కు అవసరం ఉన్న, పవర్‌‌లోకి రావాల్సిన ఏకైక పార్టీ బీజేపీనే. శుక్రవారం ఫేస్‌‌బుక్ సేవలు 50 నిమిషాల పాటు నిలిచిపోయినందుకు కంగారు పడ్డాం. కానీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. బెంగాల్‌‌లో గత 50 ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. కాంగ్రెస్‌తోపాటు కమ్యూనిస్ట్, తృణమూల్ పార్టీలు ప్రజల కలలను సర్వనాశనం చేశాయి. ఈ 70 ఏళ్లలో ఇక్కడి ప్రజలు అన్ని పార్టీలకు అవకాశాలు ఇచ్చారు. వచ్చే ఐదేళ్లు మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. బెంగాల్ కోసం మా ప్రాణాలను త్యాగం చేయడానికైనా రెడీ’ అని మోడీ చెప్పారు.